కేర్ గ్రూప్‌లోకి నిధుల జోరు!

29 Mar, 2014 01:51 IST|Sakshi
కేర్ గ్రూప్‌లోకి నిధుల జోరు!

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హెల్త్‌కేర్ సేవల  రంగంలో అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ తర్వాత   దేశంలోనే మూడో స్థానంలో ఉన్న   క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్(కేర్ హాస్పిటల్స్) సంస్థ విలీనాలు, కొనుగోళ్ల మార్గం ద్వారా విస్తరణ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కొత్త హాస్పిటళ్ల ఏర్పాటు కోసం ఆయా ప్రాంతాల్లో స్థానికంగా బలంగా ఉండే సంస్థలతో కలిసి కేర్ హాస్పిటల్స్ విస్తరించనుంది. ఇనార్గానిక్ గ్రోత్ అంటే కొత్త సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీనం చేసుకోవటం ద్వారా వృద్ధి సాధించాలన్నది సంస్థ వ్యూహం.

 అడ్వెంట్ ఇండియా పీఈ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేర్ హాస్పిటల్స్‌కు 15-20 మిలియన్ డాలర్ల మేర (రూ.90-120 కోట్లు) విస్తరణ నిధులను సమకూర్చేందుకు తాజాగా  పచ్చ జండా ఊపినట్లు తెలిసింది. అయితే   ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నారనే అంశాన్ని వెల్లడించేందుకు అడ్వెంట్ సంస్థ నిరాకరించింది. సాక్షి ప్రతినిధి ప్రశ్నకు  ఈ మెయిల్ ద్వారా సమాధానమిస్తూ ‘‘ఈ విషయంపై మేం వ్యాఖ్యానించదలచుకోలేదు’’అని అడ్వెంట్ ఇండియా పీఈ అడ్వైజర్స్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగంలో అడ్వెంట్ సంస్థ 30 హెల్త్‌కేర్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. 2012లో అడ్వెంట్ సంస్థ   కేర్ హాస్పిటల్స్‌లో 110 మిలియన్ డాలర్లు (రూ. 560 కోట్లు)   ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదనపు పెట్టుబడుల కోసం పీఈ ఫండ్స్‌తో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు తుది దశలో వున్నాయని కేర్ సంస్థల గ్రూప్ సీఈఓ దిలీప్ జోస్ సాక్షికి తెలిపారు. కొత్త హాస్పిటల్స్ టేకోవర్లు, విలీనాల ద్వారా వేగంగా కేర్‌ను విస్తరించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 కేర్ హాస్పిటల్స్ ప్రస్తుతం వైజాగ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, నాగపూర్, సూరత్, పుణె,  హైదరాబాద్‌లలో మొత్తం 12 హాస్పిటళ్లను నిర్వహిస్తోంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా నాలుగు హాస్పిటళ్లు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో గచ్చిబౌలి ప్రాంతంలో 250 పడకల హాస్పిటల్ నిర్మాణంతో పాటు భువనేశ్వర్‌లో మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ నెలకొల్పనున్నారు. కేర్ హాస్పిటల్స్‌లో మొత్తం 2200 పడకల సామర్ధ్యం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. వచ్చే మూడేళ్లలో దీన్ని 3500 పడకల సామర్థ్యానికి తీసుకుపోవాలన్నది సంస్థ లక్ష్యం.

 స్టెంట్‌ల తయారీ  యూనిట్ కోసం...: హృద్రోగ చికిత్సలో పేరుగాంచిన కేర్ హాస్పిటల్స్ స్వంతంగా స్టెంట్‌ల తయారీ కోసం రెలిసెస్ మెడికల్ డివెసైస్ అనే సంస్థను ఏర్పాటు చేసింది.  రెండో దశలో  ఈ సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రైవేట్ ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత కేటాయిస్తారు. ఈ యూనిట్‌కోసం మొదటి దశలో కేర్ యాజమాన్యం రూ. 40 కోట్లు ఈక్విటీగానూ, రూ. 30 కోట్లు రుణాల రూపేణ సమకూర్చారు. పేషంట్లకు అమర్చే స్టెంట్‌ల తయారీలో రెలిసెస్ మెడికల్ డివెసైస్ నాణ్యతా పరంగా అంతర్జాతీయ  స్థాయిలో ఉండటంతో దేశీయంగా ఫోర్టిస్, మ్యాక్స్, జయదేవ్ సంస్థలు ఈ ఉత్పత్తిని  వినియోగిస్తున్నాయి. టర్కీతోపాటు మరికొన్ని దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు