పీఎస్‌యూ బ్యాంకుల మార్కెట్ వాటా పడిపోతుంది!

22 May, 2014 00:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల మార్కెట్ వాటా 2025కల్లా 20% క్షీణించడం ద్వారా 60%కు పరిమితమవుతుందని రిజర్వ్ బ్యాంక్ కమిటీ నివేదిక అంచనా వేసింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో పీఎస్‌యూ బ్యాంకుల వాటా 2000లో 80%గా నమోదైంది. ప్రభుత్వం వాటాలు తగ్గించుకోవడం, బ్యాంకులు పనితీరు మెరుగుపరచుకోవడం వంటి చర్యలను చేపట్టకపోతే మార్కెట్ వాటా పడిపోతుందని తెలిపింది. కాగా, ఇదే సమయంలో ప్రయివేట్ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా మూడో వంతుకు పుంజుకోనున్నట్లు పేర్కొంది. 2000లో ప్రయివేట్ రంగ బ్యాంకుల వాటా 12%గా నమోదైంది. ఇక విదేశీ బ్యాంకుల కార్యకలాపాలు నామమాత్రంగా ఉండనున్నట్లు అభిప్రాయపడింది.  

 ఆస్తుల ఒత్తిడి ...
  పీఎస్‌యూ బ్యాంకులు అటు మొండి బకాయిలతోపాటు, ఇటు తగినంత మూలధన పెట్టుబడులు లేక ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు ఆర్‌బీఐ కమిటీ నివేదిక వివరించింది. ఇవి బ్యాంకుల వృద్ధిని అడ్డగిస్తాయని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 15 ప్రయివేట్ రంగ బ్యాంకులతోపాటు, 30 విదేశీ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

మరిన్ని వార్తలు