12న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

11 Nov, 2014 01:01 IST|Sakshi

 చెన్నై: వేతనాల పెంపునకు సంబంధించిన చర్చలు విఫలంకావడంతో సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 12న(బుధవారం) సమ్మెకు దిగనున్నారు. దీంతో 12న బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశమున్నట్లు యూనియన్ అధికారి ఒకరు చెప్పారు. తక్కువలోతక్కువ 23% పెంపును ఆశిస్తున్నప్పటికీ దేశీ బ్యాంకుల అసోసియేషన్(ఐబీఏ) 11% పెంపునకు మాత్రమే అంగీకరిస్తున్నదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ) అధికారి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.

ఈ పెంపు బ్యాంకుల మొండిబకాయిల్లో(ఎన్‌పీఏలు) కేవలం 1%కు సమానమన్నారు. బ్యాంకులు మంచి నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్నాయని, అయితే మొండిబకాయిల కారణంగా నికర లాభాలు ప్రభావితమవుతున్నప్పటికీ వీటికి ఉద్యోగులు బాధ్యులుకారని వివరించారు. ఎన్‌పీఏలకు కేటాయింపులు చేపట్టినట్లే ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా జీతాల పెంపును సైతం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ, పాత ప్రయివేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన ఆఫీసర్లతోసహా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు