ఎన్‌పీఏల గుర్తింపునకు ఇకపై నెల గడువు

8 Jun, 2019 05:16 IST|Sakshi

కొత్త నిబంధనలను విడుదల చేసిన ఆర్‌బీఐ

ముంబై: మొండి బకాయిల్ని (ఎన్‌పీఏ) గుర్తించే విషయంలో ఆర్‌బీఐ శుక్రవారం నూతన నిబంధనలను విడుదల చేసింది. ఒక్కరోజు చెల్లింపుల్లో విఫలమైనా ఆయా ఖాతాలను ఎన్‌పీఏలుగా గుర్తించాలన్న ఆర్‌బీఐ పూర్వపు ఆదేశాలను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాత నిబంధనల స్థానంలో ఆర్‌బీఐ కొత్తవాటిని తీసుకొచ్చింది. రుణ ఖాతాల పరిష్కారానికి సంబంధించి ఇంతకుముందు వరకు అమల్లో ఉన్న అన్ని పరిష్కార విధానాల స్థానంలో నూతన నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆర్‌బీఐ తెలిపింది. వీటి కింద ఇకపై ఎన్‌పీఏల ఖాతాల గుర్తింపునకు గాను 30 రోజుల గడువిచ్చారు.

నూతన ఆదేశాల ప్రకారం ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులను ముందే గుర్తించి, సకాలంలో వాటిని ఆర్‌బీఐకి తెలియజేసి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఒత్తిడిలో (వసూళ్ల పరంగా) ఉన్న రుణ ఖాతాలను బ్యాంకులు ముందుగానే గుర్తించడంతోపాటు, చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన వెంటనే వాటిని ప్రత్యేకంగా పేర్కొన్న ఖాతాలుగా (ఎస్‌ఎంఏ) వర్గీకరించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. డిఫాల్ట్‌ అవడానికి ముందే పరిష్కార ప్రణాళికపై దృష్టి పెట్టాలని సూచించింది.

‘‘బ్యాంకు, ఆర్థిక సంస్థ, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వీటిల్లో ఏదైనా ఓ రుణగ్రహీత డిఫాల్ట్‌ అయినట్టు ప్రకటించిన అనంతరం 30 రోజుల్లోపు ఆయా రుణగ్రహీత ఖాతాకు సంబంధించి పరిష్కార విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. పరిష్కార ప్రణాళిక అమలు చేసేట్టయితే, రుణమిచ్చిన అన్ని సంస్థలూ అంతర్గత ఒప్పందంలోకి (ఇంటర్‌ క్రెడిటార్‌ అగ్రిమెంట్‌) వస్తాయి’’ అని ఆర్‌బీఐ పేర్కొంది. దివాలా లేదా వసూళ్లకు సంబంధించి చట్టపరమైన చర్యలు చేపట్టే స్వేచ్ఛ రుణదాతలకు ఉంటుందని స్పష్టం చేసింది.   

కొత్త నిబంధనలను నిపుణులు ప్రశంసించారు. ‘‘నూతన కార్యాచరణను 2018 ఫిబ్రవరి 12 నాటి ఆదేశాల ఆధారంగా రూపొందించారు. తగినంత మెజారిటీతో పరిష్కారాలను అన్వేషించే యంత్రాంగం ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇంటర్‌ క్రెడిటార్‌ అగ్రిమెంట్‌ అన్నది నిబంధనల మేరకు బ్యాంకులు ఉమ్మడిగా పరిష్కా రాన్ని ఐబీసీకి వెలుపల గుర్తించేందుకు తోడ్పడుతుంది’’ అని న్యాయ సేవల సంస్థ సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ పార్ట్‌నర్‌ ఎల్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. ‘‘నూతన నిబంధనలు బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఎన్‌పీఏల గుర్తింపు ఇప్పుడిక వేగాన్ని సంతరించుకుంటుంది’’ అని ఎకనమిక్‌ లా ప్రాక్టీస్‌ సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సుహైల్‌ నథాని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు