ఆర్‌బీఐ వివాదం: రఘురామ్‌ రాజన్‌ స్పందన

6 Nov, 2018 13:04 IST|Sakshi
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (పైల్‌ ఫోటో)

ఆర్‌బీఐ మిస్టర్‌ వాల్‌ ద్రావిడ్‌లా ఉండాలి, సిద్ధులా  కాదు

ఆర్‌బీఐ సీట్‌బెల్టు లాంటిది

ఆర్‌బీఐ ప్రతిపత్తిని కాపాడాలి

సెక్షన్‌ 7 ను వినియోగించి వుంటే సంబంధాలు మరింత  దెబ్బతినేవి 

సాక్షి,ముంబై: కేంద్రం, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మధ్య రగులుతున్న వివాదంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తొలిసారి స్పందించారు.   కేంద్ర ఆర్థిక శాఖ,  ఆర్‌బీఐ పరస్పరం గౌరవప్రదంగా వ్యవహరించి వుంటే ప్రస్తుత వివాదాన్ని నిరోధించగలిగేదని వ్యాఖ్యానించారు.  ఒక జాతీయ సంస్థ ఆర్‌బీఐని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్‌బీఐ బోర్డుకు  మెత్తగా చురకలంటించారు.

అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ బోర్డు రాహుల్‌ ద్రావిడ్‌లాగా వ్యవహరించాలని, నవజోత్‌ సిద్ధులా దూకుడుగా ఉండకూదని వ్యాఖ్యానించారు.  కార్యాచరణ నిర్ణయాలకు దూరంగా ఉంటూ, ఘర్షణాత్మక వైఖరి కాకుండా, రక్షణాత్మక ధోరణిలో ఆర్‌బీఐ  వ్యవహరించాలని బోర్డుకు సూచించారు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం, సెక్షన్‌ 7, ఎన్‌బీఎఫ్‌సీ, ఆర్‌బీఐ బోర్డు, సీఐసీ నోటీసులు తదితర వివాదాల నేపథ్యంలో రాజన్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు.

జాతీయ సంస్థ కేంద్ర బ్యాంకు (ఆర్‌బీఐ)ను కాపాడుకోవాల్సి అవసరం ఉందని రాజన్‌  పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ మధ్య అనారోగ్యకరమైన భిన్నాభిప్రాయాలను బహిరంగపర్చడం ద్వారా మరింత దిగజార్చుకోకూడదని అన్నారు. ఒకసారి ఆర్‌బీఐ గవర్నర్‌గానో, డిప్యూటీ గవర్నర్‌గానో నియమితులైతే ప్రభుత్వం మాట వినాల్సిందేనని హితవు పలికారు. మరోవైపు ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరేల్‌ ఆచార్య వ్యాఖ్యలను రాజన్‌ ప్రశంసించారు.

ఎన్‌బీఎఫ్‌సీల వివాదంపై స్పందిస్తూ  కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ మధ్య విబేధాలున్నా, పరస్పర గౌరవం ఇద్దరికీ వుండాలన్నారు.  ఆర్‌బీఐ కారు సీట్‌ బెల్ట్‌ లాంటిదన్నారు. ప్రమాదాలను నివారించాలంటే సీటు బెల్టు పెట్టుకోవడం ముఖ్యమని రాజన్‌ వ్యాఖ్యానించారు.  అలాగే కారును నడిపే ప్రభుత్వం సీట్‌ బెల్టు పెట్టుకోవాలా లేదా అనేది ప్రభుత్వమే  నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు.  ప్రభుత్వం వృద్ధిపై దృష్టిపెడితే, ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తుందని రాజన్‌ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలకు నో  చెప్పే అధికారం కూడా ఆర్‌బీఐకి ఉంటుందని  స్పష్టం చేశారు. ఎందుకంటే రాజకీయ, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఆర్‌బీఐకి ఉండవు. కేవలం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే ముఖ్యం. ఈ విషయంలో  కేంద్రానికి, ఆర్‌బీఐకి మధ్య భిన్నాభిప్రాయాలున్నా పరస్పరం  గౌరవించుకోవడం  చాలా ముఖ్యమని రాజన్‌ అభిప్రాయపడ్డారు. సెక్షన్‌-7 ప్రభుత్వం వినియోగించి వుంటే పరిస్థితి మరింత దిగజారేదని తెలిపారు.

ద్రవ్యోల్బణం విషయంలో భారతదేశం మెరుగైన పరిస్థితిలోఉందని, ద్రవ్యోల్బణాన్నికట్టడి చేసిన ఘనత ప్రభుత్వం, ఆర్‌బీఐకు దక్కుతుందని పేర్కొన్నారు. అయితే కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) ఆందోళనను పెంచుతున్నట్లు రాజన్  చెప్పారు.

మరిన్ని వార్తలు