రెరా ఫలాలు  2020 తర్వాతే!

10 Nov, 2018 01:13 IST|Sakshi

‘సాక్షి రియల్టీ’తో క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ జక్సే షా

రెరాతో నిర్మాణ రంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం

లావాదేవీల్లో పారదర్శకతతో పాటూ పీఈ, విదేశీ పెట్టుబడులొస్తాయ్‌ 

మెట్రో నగరాల్లో ల్యాండ్‌ అబాండ్‌మెంట్‌ను 50 శాతానికి పెంచాలి 

మొక్క నాటగానే రాత్రికి రాత్రే చెట్టుగా పెరిగి.. ఫలాలను ఇవ్వదు. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కూడా అంతే! ప్రస్తుతం దేశంలో రెరా శైశవ దశలో ఉంది. దాని ప్రయోజనాలు పొందాలంటే రెండేళ్ల వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. నిర్మాణంలో నాణ్యతతో మొదలుకుంటే గడువులోగా ప్రాజెక్ట్‌ల పూర్తి, లావాదేవీల్లో పారదర్శకత, వాస్తవ వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు.. వంటివి రెరాతో సులభమవుతాయి. 2020 తొలి త్రైమాసికం నుంచి దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఏ పరిశ్రమకైనా నియంత్రణ వ్యవస్థ అనేది అత్యవసరం. బ్యాంక్‌లకు ఆర్‌బీఐ, మార్కెట్లకు సెబీ, బీమాకు ఐఆర్‌డీఏ ఎలాగో.. రియల్టీకి రెరా కూడా అంతే. రెరా కారణంగా 2–3 ఏళ్ల వరకూ కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు, భారీ ప్రాజెక్ట్‌లు సప్లయి తక్కువగా ఉంటడం సహజమేనని, కానీ నిర్మాణ రంగం ఎదుర్కొనే చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం రెరాతో లభిస్తుందని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) నేషనల్‌ ప్రెసిడెంట్‌  ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలో జక్సే షా తెలిపారు. 

గృహాలపై ఎన్నికల ప్రభావం ఉండదు.. 
సాధారణంగా ఎన్నికల సమయంలో 3 నెలల పాటు ప్రతికూల వాతావరణం ఉండటం సహజం. అయితే ఇది కేవలం ఆఫీస్, రిటైల్‌ విభాగాలకే పరిమితమవుతుంది. ఎందుకంటే నివాస విభాగంలో ఇన్వెస్టర్ల కంటే వాస్తవ గృహ కొనుగోలుదారులే ఎక్కువగా ఉంటారు. వీరికి ఎన్నికలు, ఇతరత్రా రాజకీయాంశాలతో సంబంధం ఉండదు. నిజం చెప్పాలంటే ఇలాంటి సమయంలోనే గృహ కొనుగోళ్లు ఎక్కువగా జరుపుతుంటారు. ఎందుకంటే? నగదు రాయితీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు కాబట్టి! అదే ఆఫీస్, రిటైల్‌ విభాగాలు ఇన్వెస్టర్లతో అనుసంధానమై ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడితే నిబంధనలు, నిర్ణయాలు ఎలా ఉంటాయోనని ఎన్నికల సమయంలో వేచి చూసే ధోరణిలో ఉంటారు. 

50 శాతం ల్యాండ్‌ అబాండ్‌మెంట్‌.. 
మెట్రోల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయంలో భూమి ధరే 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ల్యాండ్‌ అబాండ్‌మెంట్‌ 33 శాతం మాత్రమే ఇవ్వటం సరైంది కాదు. దీన్ని 50 శాతానికి పెంచాలి. లేకపోతే ఇతర నగరాల్లోని కొనుగోలుదారులతో పోలిస్తే మెట్రోలో 3–4 శాతం జీఎస్‌టీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. స్థల, పన్ను సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటూ నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) కాలపరిమితిని పెంచాల్సిన అవసరముంది. 

తెలంగాణలో 1,94,602 గృహాలు 
మనిషి అత్యవసరాల్లో ఒకటి సొంతిల్లు. కానీ, ఆశించిన స్థాయిలో దేశంలో ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ, ఎంఐజీ గృహాల సరఫరా లేదు. అందుకే పీఎంఏవైలో క్రెడాయ్‌ భాగస్వామ్యమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 60,36,220 పీఎంఏవై గృహాలు మంజూరు కాగా.. ఇందులో 9,66,236 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 31,79,440 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9,21,877 గృహాలు మంజూరయ్యాయి. 1,08,643 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. 6,21,475 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో 1,94,602 మంజూరయ్యాయి. 15,170 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా.. 1,50,865 నిర్మాణంలో ఉన్నాయి. 

భవిష్యత్తు కో–వర్కింగ్, వేర్‌హౌస్‌లదే.. 
దేశంలో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్‌ రంగ కంపెనీల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. చాలా వరకు సంస్థలు తక్కువ స్పేస్‌లో ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో సాధారణ ఆఫీసు స్పేస్‌ గిరాకీ తగ్గింది. స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రవేశంతో కో–వర్కింగ్‌ స్పేస్, ఈ–కామర్స్‌ కంపెనీలతో గిడ్డంగులకు డిమాండ్‌ బాగా పెరిగింది. రానున్న రోజుల్లో కో–వర్కింగ్, గిడ్డంగి విభాగాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. 

కార్మికుల్లో నైపుణ్యం కొరత.. 
ప్రస్తుతం క్రెడాయ్‌కు 28 రాష్ట్రాల్లో 204 చాప్టర్లున్నాయి. 12 వేల మంది సభ్యులున్నారు. ఏప్రిల్‌ నాటికి 300 చాప్టర్లకు విస్తరించాలని లకి‡్ష్యంచాం. గుజరాత్, కేరళ, మహారాష్ట్రలతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లోని నిర్మాణ కార్మికుల్లో నైపుణ్యం తక్కువగా ఉంది. త్వరలోనే ఆయా రాష్ట్రాల్లోని క్రెడాయ్‌ సంఘాలతో కలిసి లేబర్లకు నైపుణ్య శిక్షణ శిబిరాలను ప్రారంభించనున్నాం. 

హైదరాబాద్‌ రియల్టీలోకి సావీ 
అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ సావీ గ్రూప్‌ హైదరాబాద్‌ రియల్టీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఏడాదిలో నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి గోల్ఫ్‌ కోర్ట్‌ లేదా టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని సావీ గ్రూప్‌ ఎండీ జక్సే షా తెలిపారు. స్థానిక ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు, ప్రోత్సాహాలతో ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ మార్కెట్‌కు మంచి అవకాశాలున్నాయని.. అందుకే భాగ్యనగరంలో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. సావీ గ్రూప్‌ అహ్మదాబాద్‌లోని రాజ్‌పత్‌ క్లబ్‌ సమీపంలో 900 ఎకరాల్లో కెన్స్‌విల్లీ పేరిట గోల్ఫ్‌ కోర్ట్‌ను అభివృద్ధి చేసింది. దేశంలోనే అతిపెద్ద గోల్ఫ్‌ ప్రాజెక్ట్‌ ఇది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో 25 లక్షల చ.అ.ల్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. గిఫ్ట్‌ సిటీలో ప్రాగ్యా, ఎస్‌జీ రోడ్‌లో స్ట్రాటా, సంస్కార్, స్వరాజ్‌ నిర్మాణాలు రానున్నాయి. ముంబైలో 60 ఎకరాల్లో టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనుంది.   

మరిన్ని వార్తలు