ఆర్థిక క్రమశిక్షణతోనే వృద్ధి గాడిలోకి: జైట్లీ

16 Jun, 2014 00:16 IST|Sakshi
ఆర్థిక క్రమశిక్షణతోనే వృద్ధి గాడిలోకి: జైట్లీ

 శ్రీనగర్: దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడాలంటే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5% దిగువనే కొట్టుమిట్టాడుతున్న జీడీపీ వృద్ధి రేటును పుంజుకునేలా చేయాలంటే కొన్ని కీలక చర్యలు అత్యంత ఆవశ్యకమని ఆయన చెప్పారు. రక్షణ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న జైట్లీ... ఆదివారమిక్కడ భద్రతకు సంబంధించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం దేశం ఆర్థికపరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. కాగా, ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న ప్రశ్నకు.. బడ్జెట్‌లో ఏం చేయబోతున్నామనేది ఇప్పుడే నాతో చెప్పించాలనుకుంటున్నారా అని చమత్కరించారు. మందగమనంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయాలంటే వచ్చే రెండేళ్లలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, కొన్ని వర్గాలకు ఇవి రుచించనప్పటికీ భరించాల్సిందేనంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన మర్నాడే జైట్లీ ఇదే తరహాలో వ్యాఖ్యానించడం గమనార్హం.

మరిన్ని వార్తలు