ఆర్‌కామ్‌ దివాలాకు.. తొలగిన అడ్డంకులు 

1 May, 2019 00:58 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) దివాలా ప్రక్రియను ఎదుర్కోనుంది. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) అనుమతించింది. ఎరిక్సన్‌ పిటిషన్‌ మేరకు కంపెనీకి వ్యతిరేకంగా దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ లోగడ ఆదేశించగా.., దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌కామ్‌ గతేడాది జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆర్‌కామ్, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్‌ టెలికాంకు వ్యతిరేకంగా ఎరిక్సన్‌ దివాలా పిటిషన్‌ వేయడంతో ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ 2018 మే 15న తీర్పు జారీ చేసింది.

తాత్కాలిక పరిష్కార నిపుణుడిని సైతం నియమించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) తాజాగా వెనక్కి తీసుకుంది. సంస్థ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దివాలా ప్రక్రియ మెరుగైనదిగా కంపెనీ బోర్డు భావించింది. దీంతో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఆర్‌కామ్‌ కోరడంతో అందుకు ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతించింది.    
 

మరిన్ని వార్తలు