టీవీఎస్‌ మోటార్‌ లాభం 19 శాతం డౌన్‌ 

1 May, 2019 00:54 IST|Sakshi

9 శాతం పెరిగిన ఆదాయం   

న్యూఢిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నికర లాభం (స్టాండ్‌అలోన్‌) గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్‌లో 19 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు తగ్గిందని టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,007 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లకు పెరిగింది. మొత్తం టూ వీలర్, త్రీ వీలర్‌ అమ్మకాలు 8.89 లక్షల నుంచి 9.07 లక్షలకు పెరిగాయి. ఎబిటా రూ.295 కోట్ల నుంచి 4.4 శాతం వృద్ధితో రూ.308 కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్‌ 7 శాతంగా నమోదైంది.  

ఏడాది అమ్మకాలు  37.57 లక్షలు  
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.663 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 1 శాతం పెరిగి రూ.670 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.ఆదాయం రూ.15,519 కోట్ల నుంచి రూ.18,210 కోట్లకు ఎగసిందని వివరించింది. మొత్తం టూ వీలర్‌ అమ్మకాలు 33.67 లక్షల నుంచి 37.57 లక్షలకు చేరాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 4 శాతం నష్టంతో రూ.486 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు