విదేశాలలో రిలయన్స్‌ జియో లిస్టింగ్‌!

27 May, 2020 10:53 IST|Sakshi

ప్రణాళికల్లో ఉన్న ముకేశ్‌ అంబానీ

రానున్న 12-24 నెలల్లోగా ఐపీవో

జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4 వారాల్లో 5 డీల్స్‌ 

10.3 బిలియన్‌ డాలర్ల సమీకరణ

రూ. 5 ట్రిలియన్లకు ఎంటర్‌ప్రైజ్‌ విలువ

అనుబంధ డిజిటల్‌, మొబైల్‌ విభాగం రిలయన్స్‌ జియోను విదేశాలలో లిస్ట్‌ చేసే యోచనలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ చైర్మన్‌, దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి విదేశాలలో రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా రియలన్స్‌ జియో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలలో 5 డీల్స్‌ కుదుర్చుకోవడం ద్వారా 10.3 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 77250 కోట్లు)ను సమకూర్చుకుంది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 5.7 బిలియన్‌ డాలర్లను వెచ్చించడం ద్వారా రిలయన్స్‌ జియోలో 9.9 శాతం వాటాను సొంతం చేసుకోగా.. పలు పీఈ సంస్థలు సైతం స్వల్ప స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. ఫలితంగా జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ. 5.15 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దీంతో అల్ఫాబెట్‌, టెన్సెంట్‌, అలీబాబా వంటి దిగ్గజాలతో పోల్చవచ్చని పేర్కొంటున్నారు.

రిటైల్‌ సైతం
ఐదేళ్లలోగా రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బిజినెస్‌లను స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ గతేడాది ఆగస్ట్‌లో పేర్కొన్నారు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా పలు విదేశీ సం‍స్థలను భాగస్వాములుగా చేసుకోనున్నట్లు తెలియజేశారు. కాగా.. దేశీ కంపెనీలు డైరెక్ట్‌గా విదేశాలలో లిస్టయ్యేందుకు వీలుగా అవసరమైన నిబంధనలను సవరించనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. తద్వారా దేశీ కంపెనీలకు విదేశీ నిధుల లభ్యతను పెంచేందుకు వీలు కలుగుతుందని వివరించింది. అయితే పన్ను సంబంధిత, విదేశీ మారక నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

రుణ భారం తగ్గింపు
ఓవైపు రిలయన్స్‌ జియోలో వాటాల విక్రయం ద్వారా 10.3 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోవైపు రైట్స్‌ ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 53,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. నిధులలో అధిక శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2021 మార్చికల్లా రుణ రహిత కంపెనీగా నిలవాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆశిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు