అమెరికాలో రెన్యువల్‌ భయం !

17 May, 2017 00:14 IST|Sakshi
అమెరికాలో రెన్యువల్‌ భయం !

హెచ్‌1బీ వీసా పొడిగింపు దరఖాస్తులకు అధికారుల కొర్రీలు
దాదాపు ప్రతి దరఖాస్తుకూ ఎవిడెన్స్‌ కావాలంటూ లేఖలు
కొన్ని ఆఫీసులకు నేరుగా వెళ్తున్న యూఎస్‌సీఐఎస్‌ సిబ్బంది
బ్యాచిలర్‌ డిగ్రీ లేకున్నా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటున్న అమెరికన్‌ సంస్థలు
భారత ఐటీ కంపెనీల స్థానిక రిక్రూట్‌మెంట్లు కూడా షురూ
దీంతో అమెరికాలోని తెలుగు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన
మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరమేనంటున్న నిపుణులు
కొత్త టెక్నాలజీలకు అప్‌గ్రేడ్‌ కావడమే మార్గమని సూచన  


హైదరాబాద్‌– బిజినెస్‌ బ్యూరో : శ్రీధర్‌ చాన్నాళ్ల కిందట హెచ్‌1బీ వీసాపై అమెరికా వెళ్లాడు. గ్రీన్‌కార్డుకు అప్లయ్‌ చేశాడు కానీ... ఇంకా రాలేదు. అది క్యూలో ఉంది కనక డిపెండెంట్‌ వీసాపై అమెరికా వెళ్లిన శ్రీధర్‌ భార్య భార్గవి కూడా ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ) సాయంతో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ రెండేళ్ల కిందటే అక్కడ ఇల్లు కూడా కొన్నారు. ఈఎంఐ కాస్త ఎక్కువే. అయితేనేం!! ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనక ఇబ్బంది లేదు. కాకపోతే శ్రీధర్‌ హెచ్‌1బీ గడువు ముగుస్తోంది. దీంతో మూడేళ్ల పొడిగింపు కోసం దరఖాస్తు చేశాడు. దానికి వీసా కార్యాలయం నుంచి ఎవిడెన్స్‌లు కావాలనే అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌ఏ) వచ్చింది. దీంతో తన వీసా తిరస్కరణకు గురవుతుందా? ఇబ్బందులేమైనా వస్తాయా? అనే గుబులు శ్రీధర్‌లో మొదలైంది.

రాఘవ కూడా దాదాపు రెండున్నరేళ్ల కిందట హెచ్‌1బీపై అమెరికాకు వెళ్లాడు. తన వీసా గడువు మూడేళ్లు. మరో ఆరు నెలలే ఉండటంతో గతనెల్లో రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేశాడు. తనక్కూడా యూఎస్‌సీఐఎస్‌ కార్యాలయం నుంచి ఆర్‌ఎఫ్‌ఏ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌లో వారు పేర్కొన్న అన్ని పత్రాలనూ రాఘవ సమర్పించాడు. అయితే యూఎస్‌సీఐఎస్‌ సిబ్బంది రాఘవ పనిచేస్తున్న కార్యాలయాన్ని కూడా సందర్శిస్తామని చెప్పారు. ఇదంతా చూశాక... రాఘవకు తన వీసా రెన్యువల్‌ అవుతుందా? అనే అనుమానం మొదలైంది.

రోజులు గడుస్తున్న కొద్దీ అది పెరుగుతోంది కూడా!!
‘అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే’ అనే నినాదంతో అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచాక అక్కడి ఉద్యోగ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆ ప్రభావం ఇండియాపై ఎక్కువగానే పడుతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌... అక్కడే మూడు కేంద్రాలు ఆరంభిస్తామని, స్థానికులను ఉద్యోగాల్లోకి  తీసుకుంటామని చెప్పటమే కాక... దానికి తగ్గట్టు అక్కడ రిక్రూట్‌మెంట్లు కూడా మొదలుపెట్టింది. కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాలు కూడా అదే పనిలో పడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థలు ఇండియాలో సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. కోతలు పెంచుతున్నాయి.

ఇదంతా ఒకెత్తయితే... కొన్నాళ్ల కిందటే అమెరికాకు హెచ్‌1బీపై వెళ్లి... అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి వీసా రెన్యువల్‌ రూపంలో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘‘ఇదివరకు వీసా రెన్యువల్‌కు చేసిన దరఖాస్తుల్లో తక్కువ వాటికే ఆర్‌ఎఫ్‌ఏ వచ్చేది. కానీ ఇపుడు దాదాపు అన్ని దరఖాస్తులకూ ఆర్‌ఎఫ్‌ఏ వస్తున్నట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి వీసా నిబంధనలను మరింత కఠినం చెస్తున్నట్లు అర్థమవుతోంది. పరి స్థితి ఇలాగే కొనసాగితే పలువురు తెలుగువారు తిరిగి స్వదేశానికి వెళ్లక తప్పదు’’ అని 20 ఏళ్ల కిందట యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డ అనంతపురం వాసి ఒకరు చెప్పారు.

పోటీ మరో రూపంలోనూ వస్తోంది!
అమెరికాలో ఇండియన్లు పలు రంగాల్లో ఉన్నా... ఐటీ రంగంలో మాత్రం తెలుగువారిదే పైచేయి. దాదాపు 25 లక్షల మంది తెలుగువారు ఐటీ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు స్థానిక అసోసియేషన్లు చెబుతున్నాయి. స్థానికులు చెబుతున్న సమాచారం మేరకు... ఇపుడు రిక్రూట్‌మెంట్లలో అమెరికన్‌ కంపెనీల దృక్పథం కూడా మారుతోంది. ట్రంప్‌ పాలసీలకు అనుగుణంగా మరింత మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించటానికి వారు కొన్ని నిబంధనల్ని కూడా సడలించుకుంటున్నారు.

అక్కడ ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలకు ఇప్పటిదాకా బీఎస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌) ఉత్తీరణ తప్పనిసరి అనేవారు. ‘‘నిజానికి అక్కడ హైస్కూల్‌ చదువుతో ఆపేసిన పలువురు యువతకు వివిధ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లపై పట్టు ఉంది. కోడ్‌ రాయటం వారికి పెద్ద పనేమీ కాదు. కానీ బీఎస్‌ లేదన్న కారణంతో ఇన్నాళ్లూ వారు ఐటీ ఉద్యోగాలకు నోచుకోలేదు. కానీ ఇపుడు కంపెనీలు తమ ధోరణి మార్చుకుంటున్నాయి. బీఎస్‌ అనే నిబంధనను సడలించి ఉద్యోగంలోకి తీసుకుందామని, తరవాత తామే బీఎస్‌ చదువుకునేలా స్పాన్సర్‌ చేయొచ్చని అవి యోచిస్తున్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలయితే దీని ప్రభావం ఎక్కువగా పడేది తెలుగువాళ్లపైనే’’ అని స్థానికంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థ నడుపుతున్న మరో తెలుగు వ్యక్తి అభిప్రాయపడ్డారు.

స్థానిక కంపెనీలదీ అదే బాట!!
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటిదాకా తమ సిబ్బందిని క్లయింట్‌ సంస్థలుండే అమెరికాకు పంపటం ఎక్కువగానే జరిగేది. ఈ సంవత్సరం అది బాగా తగ్గిపోయింది. అక్కడి వారినే తీసుకుందామని కంపెనీలు భావించటం దీనికి ప్రధాన కారణం. అదేకాదు. కొన్నాళ్ల కిందటి దాకా క్లయింట్లతో సమావేశాలకు తమ సిబ్బందిని ఈ కంపెనీలు తాత్కాలికంగా యూఎస్, యూకేలకు పంపించేవి. ఇపుడు వాటికి కూడా పూర్తిగా కోతపెట్టాయి. ఇక్కడి నుంచే ‘టెలీ ప్రజెన్స్‌’లో సమావేశం కావాలని తమ సిబ్బందికి చెబుతున్నారు. అంటే ఒకరకమైన వీడియో కాల్స్‌ వంటివన్న మాట.

మనం సర్వీసెస్‌లో ఉండిపోవటం వల్లేనేనా?
భారత ఐటీ రంగం చిరకాలంగా సర్వీసులపైనే ఆధారపడి నెట్టుకొస్తోందని, మన నుంచి బ్లాక్‌బస్టర్‌ ఉత్పత్తి ఒక్కటీ లేదని ఐటీ కన్సల్టెంట్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటి కంపెనీలు పలు ఉత్పత్తుల్ని తెస్తున్నాయి. భారతీయులే వాటిని నడిపించే స్థానాల్లో ఉన్నా... భారత దేశం నుంచి ఒక్క ఉత్పత్తీ లేకపోవటం విషాదకరమే. ప్రస్తుతం ఉత్పత్తులు పెరుగుతున్నాయి కానీ సర్వీసులు పెరగటం లేదు. అదే తాజా పరిస్థితులకు కారణం’’ అని ఆయన తెలియజేశారు.  

అసలు కారణాలివీ...
నిజానికి ఐటీ రంగంలో ఉద్యోగాలు పోవటానికి అంతా ట్రంప్‌నే కారణంగా చూపిస్తున్నా... నిపుణులు మాత్రం అదొక్కటే కారణం కాదని చెబుతున్నారు. ‘‘కొన్నాళ్లుగా ఐటీ రంగం నెమ్మదించింది. ఎందుకంటే వివిధ సంస్థలు ఐటీపై పెడుతున్న ఖర్చును తగ్గించేశాయి. దీంతో గత నాలుగేళ్లుగా ఐటీ కంపెనీల బిల్లింగ్‌ పెరగటం లేదు. పైపెచ్చు ఐటీ సంస్థల మధ్య పోటీ పెరగటంతో ఇపుడు బిల్లింగ్‌ తగ్గిస్తామని బేరాలు కూడా ఆడుతున్నారు. మరోవంక ఐటీ కంపెనీలు మాత్రం ప్రతి  ఏటా తమ సిబ్బందికి కనీసం 10 శాతం జీతం పెంచాల్సి వస్తోంది.

 దీంతో ఖర్చులు పెరిగి, చివరకు ఉద్యోగాల్లో కోత పెట్టాల్సి వస్తోంది’’ అని టీసీఎస్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాల వల్ల పలు భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడి వారినే నియమించడానికి దిగుతున్నాయి. ఈ ప్రభావం ఇక్కడి ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుంది. దీనికితోడు ఆటోమేషన్‌ వల్ల పలువురి ఉద్యోగాలు పోతున్నాయి. ఈ మూడు కారణాలూ కలిసి ఐటీని భయపెడుతున్నాయి’’ అని కాగ్నిజెంట్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, డిజిటల్‌ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని, ఆ టెక్నాలజీకి అప్‌గ్రేడ్‌ అయిన వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అమెరికాలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థను నిర్వహిస్తూ... విజయవాడలో ‘ఫ్రిస్కా’ పేరిట హోమ్‌హెల్త్‌కేర్‌ సంస్థను ఏర్పాటు చేసిన అసిఫ్‌ మొహమ్మద్‌ చెప్పారు.

‘‘మనమిపుడు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రపంచంలో ఉన్నాం. క్లౌడ్‌ ఆటోమేషన్‌ ఇంకా పెరుగుతుంది. ఉద్యోగులు అత్యాధునిక సర్వర్‌లెస్‌ కంప్యూటింగ్‌ (లాంబ్డా), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) డేటా సైన్స్‌ వంటి టెక్నాలజీల్లో తమ నైపుణ్యాల్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవటం తప్పనిసరి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ యుగమని, ప్రతిదీ ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ కావాల్సిందేనని చెబుతూ... అందుకే తాము టెక్నాలజీ ఆధారంగా విజయవాడలో తొలి హోమ్‌హెల్త్‌కేర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన.

మరిన్ని వార్తలు