చివరి దశలో హెచ్‌-4 వీసా రద్దు

25 May, 2018 12:02 IST|Sakshi

వాషింగ్టన్:  భారతీయ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త.  హెచ్-4 వీసాను రద్దు చేసే  ప్రక్రియ చివరి దశల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సంకేతాలు అందించింది.  అమెరికాలో హెచ్ -1బి వీసా మీద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే స్పౌస్‌ వీసా హెచ్‌-4ను రద్దు చేయాలన్న నిర్ణయం తుది దశలో ఉందని ట్రంప్‌  పరిపాలన విభాగం అమెరికా కోర్టుకు తెలియజేసింది. ప్రతిపాదిత నియమం తుది  దశంలో ఉందని  డిపార్ట్‌మెంట్ అఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)  ఫెడరల్ కోర్టుకు  గురువారం నివేదించింది. ఈ నిర్ణయం తుదిరూపు దాల్చి అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. 

హెచ్1బి వీసా మీద అమెరికాలో పనిచేసే వృత్తినిపుణుల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలో నివసించడానికి  అనుమతి లభిస్తుంది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో (2015)లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయటానికి అనుమతించిన  ఈఏడీ (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కి చరమగీతం పాడాలని ట్రంప్‌ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా హెచ్-4 వీసాదారులకు ఈఏడీల జారీని రద్దు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) 2017 సెప్టెంబర్‌లో ప్రకటించింది. అయితే  2018 ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తామని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ  పేర్కొంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే  అన్న నినాదంలో భాగంగా హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయటానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలనీ  ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో  హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలను ఎక్కువగా పొందుతున్న  భారతీయ  ఐటీ నిపుణుల్లో ఇప్పటికే  తీవ్ర ఆందోళన  నెలకొన్న సంగతి విదితమే. దాదాపు 70వేల మంది హెచ్‌-4 వీసాదారుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది.

మరిన్ని వార్తలు