ఆర్‌బీఐకి ధరల కట్టడి ఒక్కటే లక్ష్యం కాకూడదు

30 Jul, 2013 05:29 IST|Sakshi
Chidambaram

అహ్మదాబాద్: ధరలను కట్టడి చేయడం ఒక్కటే రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం కాదని... పడిపోతున్న వృద్ధి రేటుకు ఊతమివ్వడం, ఉద్యోగ కల్పనపైన కూడా దృష్టిపెట్టాలని ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. తొలి త్రైమాసిక పాలసీ సమీక్షను ఆర్‌బీఐ నేడు(మంగళవారం) చేపట్టనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిదంబరం మాట్లాడారు. రూపాయి విలువ భారీగా పడిపోతుండటంతో ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) కట్టడితో సహా ఆర్‌బీఐ పలు కఠిన చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే. పాలసీ సమీక్షలో కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చన్న అంచనాలు జోరందుకున్నాయి. కాగా, బ్యాంకులు వడ్డీరేట్లను పెంచే అవకాశం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. రుణ డిమాండ్‌కు తగ్గట్టుగా తగినన్ని నిధులు బ్యాంకుల వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి పలు భారీ ప్రాజెక్టులు రానున్న రోజుల్లో పట్టాలెక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
 
 ప్రపంచ ధోరణి మారుతోంది...
 ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల ఆలోచనా ధోరణుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. దీనికి అనుగుణంగానే ఆర్‌బీఐ కూడా తన ప్రాధాన్యాలను గుర్తించాలని చిదంబరం వ్యాఖ్యానించారు. ‘ధరల స్థిరీకరణతోపాటు వృద్ధికి ఊతమివ్వడం, ఉద్యోగాల పెంపు ఇతరత్రా విస్తృత అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రిజర్వ్ బ్యాంక్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఒకే విధంగా లేవు. అయితే, భారత్‌లో ప్రస్తుతం నెలకొన్నది నిర్వహణపరమైన, ఆరోగ్యదాయక అభిప్రాయభేదాలే.’ అని విత్తమంత్రి పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టానికి పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి తిరోగమనంలోకి జారిపోయిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ గాడిలోపడాలంటే... ఆర్‌బీఐ తన కఠిన పాలసీని విడనాడాలని, వడ్డీరేట్లను మరింత తగ్గించాలంటూ కార్పొరేట్లు, ప్రభుత్వం తీవ్ర స్థాయిలోనే ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అయితే, ఆర్‌బీఐ మాత్రం ధరల కట్టడికే ప్రాధాన్యమిస్తూ వస్తోంది.
 
 రూపాయి పతనంపై...: ఆర్థిక వ్యవస్థలో తీవ్ర పరిణామాల వంటివేమీ రూపాయి క్షీణతకు కారణం కాదని, స్పెక్యులేషన్ వల్లే పతనమైందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. లిక్విడిటీకి సంబంధించి ఆర్‌బీఐ చేపట్టిన చర్యలు దేశీ కరెన్సీకి మేలుచేకూర్చేవేనని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వృద్ధిరేటు 6 శాతానికి పెరగవచ్చని(గతేడాది 5%) ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 బంగారం దిగుమతులు మళ్లీ పెరిగాయి...
 ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా జూన్‌లో బంగారం దిగుమతులు తగ్గుముఖంపట్టినప్పటికీ... జూలైలో మళ్లీ జోరందుకున్నాయని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతులపై ప్రస్తుత నియంత్రణలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పసిడి కొనుగోళ్లను పూర్తిగా ఆపేయడం కష్టమేనని, అయితే వీటిని తగ్గించుకోవాల్సిందిగా ప్రజలకు మరోసారి విత్తమంత్రి  విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు