ఒడిదుడుకుల వారం..

27 Jun, 2016 01:44 IST|Sakshi
ఒడిదుడుకుల వారం..

న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ ప్రకంపనలకు తోడు  జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారమే (ఈ నెల 30న)ముగియనుండడంతో  స్టాక్ మార్కెట్లో ఈ వారం ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. బలహీన రూపాయి, విదేశీ నిధుల ప్రవాహం తక్కువ స్థాయిలో ఉండడం, నైరుతి రుతు పవనాల విస్తరణ, తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వారంటున్నారు.  అయితే వేల్యూ బయింగ్, షార్ట్ కవరింగ్, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం, బ్రెగ్జిట్ నేపథ్యంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్రకటించే ఉద్దీపనలు ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చని వారంటున్నారు.

ఈ వారమే విడుదలయ్యే ఎనిమిది కీలక రంగాలకు సంబంధించిన గణాంకాలు, మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ ఈ శుక్రవారం వెల్లడించనున్న  భారత తయారీ రంగ పీఎంఐ గణాంకాల  ప్రభావం కూడా ఉంటుందని విశ్లేషకులంటున్నారు.  అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం... ఇవన్నీ ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలను నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు.
 
మరింత క్షీణత...
వారం ప్రారంభంలో హెచ్చుతగ్గులు ఉంటాయని, స్టాక్ సూచీలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ చెప్పారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగానే ఉందని, రానున్న 18-24 నెలల్లో మరో రెండు ప్రతికూల సంఘటనల ప్రభావం తప్పదని పేర్కొన్నారు.  యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం... ఈక్విటీలపై అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించిందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. అయితే ఈ అనిశ్చితి స్వల్పకాలమే ఉంటుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సంకేతాలతో పాటు వర్షపాత విస్తరణను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని  వివరించారు. జూన్ నెల డెరివేటివ్స్ ముగింపు కారణంగా ట్రేడర్లు ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో పొజిషన్లను రోల్ ఓవర్ చేస్తారని, ఫలితంగా హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తో ముఖ్యంగా బ్రిటన్‌తో వ్యాపార సంబంధాలు అధికంగా ఉన్న కంపెనీల రాబడులు, లాభదాయకత తీవ్రంగానే ప్రభావితమవుతాయని, కరెన్సీలు నిలకడ స్థాయికి వచ్చేదాకా ఈ పరిస్థితులు కొనసాగుతాయని  మిజుహో బ్యాంక్ ఇండియా వ్యూహకర్త తీర్థాంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. వాహన కంపెనీలు జూన్ నెల వాహన విక్రయ గణాంకాలను ఈ శుక్రవారం(వచ్చే నెల 1న) వెల్లడించనున్న నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లు వెలుగులో ఉంటాయి.  యూరప్, ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో వ్యాపార సంబంధాలున్న వాహన, ఫార్మా, ఐటీ కంపెనీలపై ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచుతారని మార్కెట్ విశ్లేషకుల ఉవాచ.
 
భారత్ బెటర్: అంతర్జాతీయ అంశాల ప్రభావం భారత్‌పై తప్పక ఉంటుందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. మన ఆర్థిక స్థితిగతులు బావుండటం, అంతర్జాతీయ ఒడిదుడుకుల ప్రభావానికి  స్వల్పంగానే లోనవడం వంటి  కారణాల వల్ల ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ కొంచెం నయమని పేర్కొంది.
 
బ్రెగ్జిట్ కొనుగోళ్లకుఅవకాశం..
బ్రెగ్జిట్.. భారత ఇన్వెస్టర్లకు దేవుడిచ్చిన అవకాశమని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోది చెప్పారు. స్టాక్ సూచీలు నిట్టనిలువునా పతనమయ్యాయని, అయితే భారత మార్కెట్ల మార్గం ముందుకేనని ఆయన వ్యాఖ్యానించారు.  దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బ్రెగ్జిట్ ఒక కొనుగోలు అవకాశమని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ ఎస్. నరేన్ చెప్పారు. స్వల్పకాలంలో మార్కెట్ గమనాన్ని అంచనా వేయడం కష్టమని, అయితే ఇటీవల పతనం దీర్ఘకాల కొనుగోళ్లకు ఒక మంచి అవకాశమని వివరించారు.

భవిష్యత్తులో బ్రెగ్జిట్ భయాలేమీ ఉండవని, వర్షాలు సరిగ్గా కురవకపోతేనే ఆందోళన పడాల్సి వస్తుందని తెలిపారు. బ్రెగ్జిట్ రెఫరెండమ్ ఫలితాలు వెలువడిన రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,100 పాయింట్లు పతనమై, చివరకు 605 పాయింట్లు నష్టపోయింది.  గతవారంలో సెన్సెక్స్ 228 పాయింట్లు (1.07 శాతం)  నష్టపోయి 26,367 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 82 పాయింట్లు (0.99 శాతం) నష్టపోయి 8,089 పాయింట్ల వద్ద ముగిశాయి.
 
బ్రెగ్జిట్‌కు ఎదురీదిన రిటైల్ ఇన్వెస్టర్లు
బ్రెగ్జిట్ కారణంగా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తగా, భారత్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.118 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే మొదటిసారి.  ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బీమా కంపెనీలు, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ రూ.115 కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి.  దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కంటే రిటైల్ ఇన్వెస్టర్ల నికర  కొనోగుళ్లు అధికంగా ఉండడం విశేషం.

రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు రూ.1,723.4 కోట్లుగా, అమ్మకాలు రూ.1,605.7 కోట్లుగా ఉన్నాయి. దీంతో వీరి నికర కొనుగోళ్లు రూ.117.74 కోట్లుగా ఉన్నాయి. మార్చి 23 నుంచి చూస్తే రిటైల్ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు ఇదే అత్యధికం. ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు రూ.100 కోట్లకు మించడం నాలుగు సందర్భాల్లోనే జరిగింది. ఇక  బ్రెగ్జిట్ కారణంగా గత శుక్రవారం భారత ఇన్వెస్టర్ల సంపద రూ.1.8 లక్షల కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద 2.5 లక్షల కోట్ల డాలర్లు హరించుకుపోయింది.  భారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపారు. బ్రోకర్లు కూడా నికర అమ్మకందారులుగా నిలిచారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు