కోవిడ్‌-19 : ఉద్యోగులకు విప్రో భరోసా

13 Jul, 2020 19:00 IST|Sakshi

టెకీలకు ఊరట

ముంబై : దేశీ ఐటీ దిగ్గజం విప్రో టెకీలకు ఊరట ఇచ్చే వార్తను వెల్లడించింది. కోవిడ్‌-19 కారణంగా తాము ఏ ఒక్క ఉద్యోగినీ విధుల నుంచి తొలగించలేదని, రాబోయే రోజుల్లోనూ అలాంటి ఆలోచనలు లేవని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్జీ స్పష్టొం చేశారు. వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నప్పటికీ మహమ్మారి కారణంగా ఉద్యోగుల తొలగింపు ఉండబోదని  చెప్పారు. సోమవారం కంపెనీ 74వ వార్షిక​సమావేశం (ఏజీఎం)లో రిషద్‌ మాట్లాడుతూ హెచ్‌1బీ వీసాపై ఆధారపడటాన్ని కూడా విప్రో అధిగమించిందని అమెరికాలో పనిచేసే తమ సిబ్బందిలో 70 శాతానికి పైగా అక్కడివారేనని చెప్పారు. కాగా, తన తండ్రి, కంపెనీ వ్యవస్ధాకులు అజీం ప్రేమ్జీ నుంచి రిషద్‌ ప్రేమ్జీ విప్రో చీఫ్‌గా గత ఏడాది బాధ్యతలు చేపట్టారు.

ఇక కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో 95 శాతం మందికి పైగా విప్రో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగులంతా ఒకేసారి కార్యాలయానికి వచ్చి పనిచేయడం సాధ్యం కాదని, రాబోయే 12-18 నెలల పాటు ఇదే పని పద్ధతి పాటిస్తామని తెలిపాయి. మరోవైపు కోవిడ్‌-19ను ఎదుర్కోవడంలో కంపెనీ చేపట్టిన చర్యలను పలువురు వాటాదారులు ప్రశంసించారు. తండ్రికి తగ్గ తనయుడని రిషద్‌ ప్రేమ్జీపై మరికొందరు ప్రశంసించగా, సీఈఓ మార్పు, కంపెనీ పనితీరుపై మరికొందరు వాటాదారులు ప్రశ్నించారు. సీఈఓను తరచూ మార్చడంపై రిషద్‌ ప్రేమ్జీ బదులిస్తూ గత సీఈఓ రాజీనామా చేయడంతో మార్పు అనివార్యమైందని చెప్పారు. లాభదాయకతతో కూడిన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని షేర్‌హోల్డర్లలో ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 

చదవండి : విప్రో కొత్త సీఈవో వేతనం ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు