ఐటీ క్వీన్‌.. రోష్ని!

18 Jul, 2020 05:22 IST|Sakshi
రోష్ని నాడార్‌ మల్హోత్ర, శివ్‌ నాడార్‌

దేశీ ఐటీ కంపెనీకి తొలి మహిళా చైర్‌పర్సన్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ పగ్గాలు చేపట్టిన రోష్ని నాడార్‌

బాధ్యతల నుండి వైదొలగిన తండ్రి శివ్‌ నాడార్‌

న్యూఢిల్లీ: భారత ఐటీ రంగంలో కొత్త క్వీన్‌ అరంగేట్రం చేసింది. పురుషాధిక్యత అధికంగా ఉన్న ఐటీ రంగంలో తొలిసారిగా ఒక ఐటీ కంపెనీ పగ్గాలు ఒక మహిళ చేతికి వచ్చాయి. దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్‌ మల్హోత్ర  నియమితులయ్యారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ స్థానంలో ఆయ న ఏకైక సంతానం, రోష్ని నాడార్‌  చైర్‌పర్సన్‌ బాధ్యతలను శుక్రవారమే స్వీకరించారు. కాగా కంపెనీ ఎమ్‌డీ(చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌)గా శివ్‌ నాడార్‌ కొనసాగుతారు.   దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా రికార్డులకు ఎక్కిన ఈమె. స్టాక్‌మార్కెట్లో లిస్టైన ఐటీ కంపెనీ చైర్‌పర్సన్‌గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ అనే ఘనతను కూడా సాధించారు.  

శాస్త్రీయ సంగీతంలో శిక్షణ: శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన రోష్ని నాడార్‌ 2013లోనే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీగా వ్యవహరిస్తున్న హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈఓగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

27 ఏళ్ల వయస్సుకే సీఈఓ  
వసంత్‌ వ్యాలీ స్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించిన రోష్ని నాడార్‌ ఢిల్లీలో కమ్యూనికేషన్స్‌ విభాగంలో డిగ్రీ చదివారు. కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎమ్‌బీఏ పట్టా పొందారు. 2009లో హెచ్‌సీఎల్‌ కార్ప్‌లో చేరారు. ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ అయ్యారు.  

మహిళా కుబేరుల్లో టాప్‌
రోష్ని నాడార్‌ 2010లో హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ వైస్‌ చైర్మన్‌ శిఖర్‌ మల్హోత్రను వివాహమాడారు. వారికి ఆర్మాన్, జాహాన్‌... ఇద్దరు కుమారులు. హురున్‌ సంస్థ తాజా కుబేరుల జాబితాలో రూ.36,800 కోట్ల సంపదతో రోష్ని నాడార్‌ భారత్‌లోనే అత్యధిక సంపద గల మహిళగా అగ్రస్థానంలో నిలిచారు.  

మరిన్ని వార్తలు