రూపాయి 6 నెలల కనిష్టానికి

17 Apr, 2018 00:42 IST|Sakshi

డాలర్‌తో పోలిస్తే 29 పైసలు క్షీణత

65.49 వద్ద క్లోజింగ్‌

ముంబై: రాజకీయ, భౌగోళిక పరిణామాలు ఆందోళనకరంగా మారడంతో పాటు వాణిజ్య లోటు పెరగడం తదితర అంశాలతో రూపాయి మారకం విలువ ఆరు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది.  డాలర్‌తో పోలిస్తే సోమవారం 0.44 శాతం తగ్గి 65.49కి పడిపోయింది.  గతేడాది అక్టోబర్‌ 3 నాటి 65.50 క్లోజింగ్‌ తర్వాత ఇదే కనిష్టం. సిరియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల దాడులతో డాలర్‌ బలపడగా .. కీలక  ఆసియా దేశాల కరెన్సీల్లో అత్యధికంగా క్షీణించినది రూపాయే.

ఆసియా దేశాల కరెన్సీల్లో చైనా యువాన్, సింగపూర్‌ డాలరు 0.1 శాతం, ఫిలిప్పీన్‌ పెసో, మలేషియా రింగిట్‌లు 0.2 శాతం మాత్రమే తగ్గాయి. సందేహాస్పద విదేశీ మారక విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను కూడా అమెరికా చేర్చడం.. ట్రేడింగ్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపినట్లు ట్రేడర్లు తెలిపారు. ఇక వాణిజ్య లోటు 13.69 బిలియన్‌ డాలర్లకు ఎగియడం, నాలుగు నెలల అనంతరం మార్చిలో ఎగుమతులు క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్స్‌ నుంచి పెట్టుబడులు కొంత ఉపసంహరించడం వంటి అంశాలు కూడా దీనికి తోడయ్యాయి.

మరిన్ని వార్తలు