మరో రికార్డు కనిష్టానికి రూపాయి 

20 Mar, 2020 19:25 IST|Sakshi

సాక్షి, ముంబై: డాలరుమారకంలో రూపాయి మరోరికార్డు కనిష్టాన్నినమోదు చేసింది. ఇంటర్‌  బ్యాంకు విదేశీ మారక మార్కెట్లో, దేశీయ కరెన్సీ 74.82 వద్ద ప్రారంభమైంది. అనంతరం 74.72  స్థాయికి పుంజుకున్నా, చివరకు అమెరికా డాలర్‌తో పోలిస్తే 8 పైసలు తగ్గి 75.20 వద్ద స్థిరపడింది. గురువారం 75.12 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా, ఆర్‌బీఐతో సహా అన్ని కేంద్ర బ్యాంకులు ప్రమాదాన్ని తగ్గించడానికి ,  ఆర్థికవ్యవస్థ పటిష్టతకు చర్యలకు దిగుతున్నాయి. అయితే భారతదేశంలో పెరుగుతున్న  కోవిడ్‌ -19 (కరోనా వైరస్) కేసులు  మరింత ఆందోళన రేపుతున్నాయి. ఫలితంగా దేశీయ కరెన్సీ కనిష్టానికి చేరిందని    ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్  రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు.

కాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో నవల కరోనావైరస్ కేసులు శుక్రవారం 223 కి పెరిగాయి. గ్లోబల్‌గా మృతుల సంఖ్య 10వేలను దాటింది.  వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ మహమ్మారి  ప్రపంచ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఫలితంగా గ్లోబల్‌ మార్కెట్లు, ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అయితే దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిసాయి.  సెన్సెక్స్ 1,626  పాయింట్లు లేదా 5.75 శాతం పెరిగి 29,916 వద్ద, నిఫ్టీ 482 పాయింట్లు లేదా 5.83 శాతం  ఎగిసి 8,745 వద్ద ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ 2.46 శాతం పెరిగి బ్యారెల్‌కు 29.17 డాలర్లకు చేరుకుంది. 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.25 వద్ద ఉంది.
  

మరిన్ని వార్తలు