రూపాయికి మరో  17పైసలు లాభం! 

14 Mar, 2019 00:08 IST|Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 17 పైసలు లాభపడి 69.54 వద్ద ముగిసింది. ఈ ఏడాది ప్రారంభం రోజు జనవరి 1వ తేదీన రూపాయి 69.43 స్థాయిని చూసింది. అటు తర్వాత రూపాయి మళ్లీ ఈ స్థితిని చూడ్డం ఇదే తొలిసారి. గడచిన మూడు రోజుల్లో రూపాయి 60 పైసలు బలపడింది. బుధవారం ఎగుమతిదారులు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున డాలర్‌ అమ్మకాలకు దిగారని ఫారెక్స్‌ డీలర్లు తెలిపారు. దేశీయ ఈక్విటీ, డెట్‌ మార్కెట్‌లోకి మరిన్ని నిధులు వస్తాయన్న అంచనాలు రూపాయికి వరుసగా రెండవరోజూ లాభాలను తెచ్చిపెట్టినట్లు విశేషణ. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.

క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 12 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకులూ రూపాయికి కలిసి వస్తోంది. 

మరిన్ని వార్తలు