మార్కెట్లోకి శామ్ సంగ్ జెడ్2

24 Aug, 2016 00:52 IST|Sakshi
మార్కెట్లోకి శామ్ సంగ్ జెడ్2

ధర రూ.4,590; జియో సిమ్ ఫ్రీ
6 నెలల్లో 10 లక్షల ఫోన్ల విక్రయాల లక్ష్యం


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘‘ప్రస్తుతం దేశంలో 800కు పైగా నగరాల్లో 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. కానీ, వినియోగదారులు మాత్రం ఆశించినంత స్థాయిలో లేరు. 4జీ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇంకా చెప్పాలంటే రూ.5 వేలు లోపుండే 4జీ ఫోన్లు కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయని’’ శామ్‌సంగ్ ఇండియా (ఎలక్ట్రానిక్స్) వైస్ ప్రెసిడెంట్ మను శర్మ చెప్పారు. టైజాన్ విపణిలో జెడ్2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశామని.. ధర రూ.4,590గా నిర్ణయించామన్నారు.

ఈ ఫోన్‌తో పాటూ జియో సిమ్, అందులోని 4జీ వాయిస్, డేటాను ఉచితంగా అందుకోవచ్చని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శర్మ చెప్పారు. ఈ నెల 29 నుంచి దేశంలోని అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో.. ఆన్‌లైన్‌లో అయితే పేటీఎం నుంచి కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లాక్, వైన్ రెడ్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్న జే2 స్మార్ట్‌ఫోన్లను 6 నెలల్లో 10 ల క్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మార్కెట్లో 22 స్మార్ట్‌ఫోన్లు..
ప్రస్తుతం దేశంలో 55 కోట్ల ఫీచర్ ఫోన్ యూజర్లుండగా.. ఏటా కొత్తగా కోటి మంది జత అవుతున్నారని.. దేశంలోని మొత్తం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 47.3 శాతం మాదేనని తెలియజేశారు. ‘‘శామ్‌సంగ్ నుంచి గతేడాది టైజాన్ విపణిని ప్రారంభించాం. ఇందులో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, ఐవీఐ, ఐఓటీ ఉత్పత్తులున్నాయి. టీవీలు, ఫ్రిజ్‌ల వంటి గృహోపకరణాలు ఢిల్లీలోని పరిశోధన అభివృద్ధి కేంద్రంలో తయారైతే.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివి బెంగళూరులోని ఆర్‌అండ్‌డీ సెంటర్లో తయారవుతాయి. ఇప్పటివరకు శామ్‌సంగ్ నుంచి 22 స్మార్ట్‌ఫోన్లుండగా.. గతేడాది టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో జెడ్1, జెడ్3 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాం. ఈ కమ్యూనిటీలో 40 వేల మంది డెవలపర్లున్నారు. 6 నెలల్లో 10 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించాం’’ అని వివరించారు. జెడ్2లోని ఎల్‌టీఈ సీఏటీ4 టెక్నాలజీని బెంగళూరులోని ఆర్‌అండ్‌డీ సెంటర్‌లో.. మిగిలిన భాగాన్ని నోయిడాలోని ఆర్‌అండ్‌డీ సెంటర్‌లో అభివృద్ధి చేశామని చెప్పారు.

ఫీచర్లివే..
5 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్, 1.5 జీహెచ్‌జెడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఎక్స్‌టర్నల్ మెమొరీ, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఓలా, ఫేస్‌బుక్, వాట్సాప్, వంటి యాప్స్‌తో పాటూ ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకుల యాప్స్ కూడా ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. న్యూ మనీ ట్రాన్స్‌ఫోన్ ఫీచర్ సహాయంతో ఉచితంగా రూ.5 వేల వరకు నగదును బదిలీ చేసుకోవచ్చు కూడా. తెలుగు, హిందీ, మరాఠీ వంటి 12 స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది.

మరిన్ని వార్తలు