పన్నుకు మందు..లాభాల్లోనూ ముందు!!

19 Feb, 2017 23:35 IST|Sakshi
పన్నుకు మందు..లాభాల్లోనూ ముందు!!

ఈఎల్‌ఎస్‌ఎస్‌లవైపు మదుపరుల మొగ్గు
►  చివరి నిమిషం పన్ను ఆదాకోసం వీటివైపు చూపు
►  ఐదేళ్లుగా 20 శాతానికిపైగా రాబడులనిస్తున్న పథకాలు
గడిచిన ఒక్క ఏడాదిలో చూస్తే 30 శాతంపైనే రాబడి
►  దీర్ఘకాలానికి ఇవే ఉత్తమమంటున్న నిపుణులు
‘సిప్‌’ పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేస్తే ఇంకా మంచిదని సూచన
►  గడిచిన 10 నెలల్లోనే రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు  


ఇది పన్నుల కాలం. అంటే... ఒకవైపు జీతంలో పన్ను కోతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి... వాటిని తప్పించుకోవటానికి హడావుడిగా వివిధ పొదుపు పథకాలవైపు పరుగులు తీసే కాలం. ఎవరెన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టినా... అందరూ ఎక్కువగా లబ్ధి పొందేది సెక్షన్‌ 80సీ నుంచే. దానిక్కూడా గరిష్ఠ పరిమితి రూ.1.5 లక్షలే. దీన్లో కూడా వివిధ బీమా పథకాలు, పిల్లల స్కూళ్లకు చెల్లించే ట్యూషన్‌ ఫీజులు తీసేస్తే... మహా అయితే ఇతరత్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేయాల్సింది ఏ రూ.50 వేలో ఉంటుంది. సరే!! మరి ఈ 50వేలైనా ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? ఎక్కడైతే మన సొమ్ముకు కాస్తంత ఎక్కువ రాబడి వస్తుంది? ఎక్కడైతే దీర్ఘకాలంలో ఊహించనంత లాభాలొస్తాయి? ఇలా ఆలోచించే వారందరికీ కనిపించే పరిష్కారమే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ పథకాలు(ఈఎల్‌ఎస్‌ఎస్‌). సంక్షిప్తంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌లు. ఒకవైపు పన్ను ప్రయోజనాలు... మరోవైపు చక్కని రాబడులు.. ఈ రెండూ కలసి ఉండటమే వీటి ప్రత్యేకత.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద బ్యాంకు డిపాజిట్లు, చిన్నమొత్తాల పొదుపు పథకాలు, బాండ్లు తదితరాల్లో పెట్టుబడి పెట్టినా పన్ను భారం తగ్గుతుంది. కానీ, చక్కని రాబడి కావాలంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌ను పరిశీలించాల్సిందే. ఇవి స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు కనక వీటి రాబడికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. కానీ చరిత్ర చూస్తే వీటి రాబడులు మెరుగ్గానే ఉన్నాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ కింద పెట్టే పెట్టుబడుల్లో సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 30 శాతం శ్లాబులో ఉన్నవారికైతే ఏడాదికి రూ.7,500 పన్ను ప్రయోజనం లభించినట్టే. అదే పది, ఇరవై ఏళ్ల కాలంలో ఆదా చేసుకునే పన్ను మొత్తం, రాబడులను అంచనా వేస్తే... ఈ అవకాశాన్ని ఎవరూ కాదనుకోరు.  

పెరుగుతున్న పెట్టుబడులు
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. దీంతో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది.
– రాఘవ్‌ అయ్యంగార్, ఐసీఐసీఐ
ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌
వైస్‌ ప్రెసిడెంట్‌  


పథకాల పనితీరు బాగు
దీర్ఘకాలంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల పనితీరు చాలా బాగుంది. చాలా మంది ఈఎల్‌ఎస్‌ఎస్‌ను పన్ను ఆదాకు ఒక అవకాశంగా చూస్తున్నారు
– హిమాన్షు వ్యాపక్, రిలయన్స్‌ కేపిటల్‌
అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ డిప్యూటీ సీఈవో  


‘సిప్‌’ పద్ధతికి పెరుగుతున్న ఆదరణ
బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు బాగా తగ్గిపోతున్న తరుణంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ అంటే ఎక్కువ మందికి తెలిసేవి కావు. ఇపుడా పరిస్థితి మారింది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అనేవి షేర్లలో పెట్టుబడి పెడతాయి కనక వీటికి గణనీయమైన రాబడులందించే సామర్థ్యం ఉంటుంది. వీటిలో రిస్క్‌ ఉంటుందనేది నిజమే అయినా... నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడి పెడుతూ వెళితే రిస్క్‌ దాదాపు ఉండదనే చెప్పాలి. పైగా రాబడుల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నేరుగా స్టాక్‌ మార్కెట్లో మదుపు కంటే ఇది సురక్షితమని చెప్పొచ్చు.

దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు...
ఈఎల్‌ఎస్‌ఎస్‌ల పనితీరు కూడా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లానే ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపుల కోసం ఇందులో పెట్టే పెట్టుబడులను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీనివల్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగుతాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో రాబడులు మెరుగ్గా ఉండడానికి ప్రధాన కారణమిదే. దీనివల్ల ఫండ్‌ మేనేజర్లకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఫలితంగా వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. అధిక రాబడులకు అవకాశం ఉంటుంది.  

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి పెట్టుబడుల వరద...
మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2016 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పది నెలల కాలంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి 940 మిలియన్‌ డాలర్లు్ల వచ్చాయి. అంటే సుమారు రూ.6,194 కోట్లు. ఇదే కాలంలో పన్ను ఆదా చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల విలువ 29 శాతానికి పైగా ఎగసి జనవరి చివరికి రూ.53,886 కోట్లకు చేరింది. నిజానికి నెలనెలా సిప్‌ విధానంలో కంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే ఎక్కువ మంది ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల వైపు చూస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పన్ను భారం తప్పించుకునేందుకు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టే ధోరణి ఎక్కువగా ఉంది.

వార్షిక రాబడి 30 శాతం కూడా దాటింది మరి!!
మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది డిసెంబర్‌కు రూ.16.46 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది రూ.20 లక్షల కోట్లను దాటుతుందని అంచనా. గడిచిన ఏడాది కాలంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు మెరుగైన రాబడులనిచ్చాయి. 30 శాతానికి పైగా రాబడులను ఇచ్చిన ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు చాలానే ఉన్నాయి. వాటినొకసారి చూస్తే...


– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

మరిన్ని వార్తలు