అన్ని కాలాలకూ అనువైనది.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ | Sakshi
Sakshi News home page

అన్ని కాలాలకూ అనువైనది.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌

Published Mon, Sep 11 2023 8:17 AM

ICICI Prudential Multi Asset Fund - Sakshi

కొంత కాలంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కీలక సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బంగారం ధరలు చెప్పుకోతగ్గంత పెరిగాయి. మార్కెట్ల గమనం పట్ల స్పష్టమైన సంకేతాలు కనిపించనప్పుడు.. అనుభవం లేని ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశించడం కష్టమే అవుతుంది. వేర్వేరు సాధనాల్లో ఉండే అస్థిరతలు, అనుకూల అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందున్న మార్గం.. మల్టీ అస్సెట్‌ మ్యూచవల్‌ ఫండ్స్‌. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ మెరుగైన పనితీరుతో ముందుంది.

రాబడులు 
ఈ పథకం 2002 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూస్తే ఏటా 21.13 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై రాబడులను తెచ్చి పెట్టింది. గడిచిన ఏడాది కాలంలోనూ 22 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్లలో 27 శాతం, ఐదేళ్లలో 15.73 శాతం, ఏడేళ్లలో 14.71 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున సగటు వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడితో పోలిస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ పథకం రాబడుల్లో అందనంత ఎత్తులో ఉంది.

మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ విభాగం రాబడి ఏడాది కాలంలో 13.55 శాతం, మూడేళ్లలో 15.42 శాతం, ఐదేళ్లలో 9.35 శాతం, ఏడేళ్లలో 7.69 శాతం, పదేళ్లలో 9.58 శాతం చొప్పున ఉంది. 6–12 శాతం వరకు ఈ పథకమే అధిక రాబడులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దశాబ్దాల నుంచి అద్భుతమైన రాబడులను ఇవ్వడమే కాదు, పనితీరులోనూ ఎంతో స్థిరత్వం కనిపిస్తుంది. అన్ని మార్కెట్‌ సైకిల్స్‌లోనూ (ఉద్దాన పతనాలు) ఈ పథకం బలమైన పనితీరు చూపించింది. సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, గత మూడేళ్లలో 23 శాతం, ఐదేళ్లలో 21.8%, పదేళ్లలో 16.6 శాతం చొప్పున వార్షిక సగటు రాబడిని ఈ పథకం ఇచ్చి ఉండేది.

పెట్టుబడుల విధానం..
మల్టీ అస్సెట్‌ పథకాలు ఈక్విటీ, డెట్, బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. దీంతో దీర్ఘకాలంలో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులకు అవకాశం లభిస్తుంది. ఈ మూడు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. వివిధ సాధనాల్లో ర్యాలీ ప్రయోజనాలను ఈ పథకం రూపంలో సొంతం చేసుకోవచ్చు. అచ్చమైన ఈక్విటీ పథకాలు మార్కెట్ల పతనాల్లో ఎక్కువ నష్టాలను చూస్తాయి. వాటితో పోలిస్తే బహుళ సాధనాలతో కూడిన ఈ పథకంలో పెట్టుబడుల విలువ క్షీణించే రిస్క్‌ చాలా తక్కువగా ఉంటుంది. లంప్‌సమ్‌ (ఒకే విడత), సిప్‌ రూపంలో పెట్టుబడులకు ఈ పథకం అనుకూలం. మార్కెట్ల కంటే ఈ పథకమే రిస్క్‌లను మెరుగ్గా నియంత్రించగలదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.21,705 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 58 శాతం కేటాయించింది. 14 శాతం డెట్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. రియల్‌ ఎస్టేట్‌లో 0.94 శాతం పెట్టుబడులు పెట్టింది. నగదు, నగదు సమానాల రూపంలో 33.73 శాతం కలిగి ఉంది. 

Advertisement
Advertisement