‘కొత్త’ చిక్కులు | Sakshi
Sakshi News home page

‘కొత్త’ చిక్కులు

Published Sun, Feb 19 2017 11:32 PM

‘కొత్త’ చిక్కులు - Sakshi

- ప్రాథమిక విద్యలో నూతన సంస్కరణలు
- కొరవడిన ముందస్తు కసరత్తు
- మార్చి నుంచే పై తరగతులకు
- మంజూరు కాని పుస్తకాలు
- బోధన ఎలాగంటున్న ఉపాధ్యాయులు
- ప్రభుత్వ నిర్ణయంపై మండిపాటు
 
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు:2929
విద్యార్థుల సంఖ్య: 6 లక్షలు
 
కర్నూలు సిటీ: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు..ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా ప్రాథమిక విద్యా విధానంలో నూతన సంస్కరణలు అమలు చేస్తుండడం విమర్శలు తావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో  చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది విద్యాశాఖ ముందస్తుగానే పరీక్షలు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ నిర్వహించాల్సిన పరీక్షలను మార్చిలోనే జరుపుతున్నారు. అలాగే మార్చి నుంచే విద్యార్థులను పైతరగతులకు పంపించనున్నారు. ఈ విధానం కార్పొరేట్, కేంద్రీయ విద్యాలయాల్లో అమలవుతోంది. ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని జిల్లా విద్యా శాఖాధికారులకు ఆదేశాలు పంపింది. ఇందులో భాగంగానే 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మార్చి 6 నుంచే వార్షిక పరీక్షలు నిర్వహించన్నారు. పరీక్షల అనంతరం విద్యార్థులకు బోధన ఎలా చేయాలన్న దానిపై విద్యాశాఖకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేవు.
 
ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం..
మార్చి నెల 20 వరకు పరీక్షలు నిర్వహించి.. 21వ తేదీ నుంచి 22 పనిదినాల రోజుల్లో  పై తరగతులకు ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంది. విద్యార్థి స్థాయికి తగ్గట్టు సామర్థ్యాల పెంపుకు ఎలాంటి (సవరణాత్మకమైన బోధ)బోధన చేయాలి అనే అంశంపై నేటికీ ప్రభుత్వం స్పష్ట్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయల్లో గందరగోళం నెలకొంది. దీనికి తోడు విద్యా సంవత్సం చివరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. నూతన విధానం అమలు చేయాలంటే  పై తరగతులకు సంబంధించిన పుస్తకాలు ఉండాలి. బోధన మొదలయ్యే నాటికే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలి. కానీ నేటికీ కొత్త పుస్తకాల ముద్రణకే ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం వార్షిక పరీక్షలు ముగిశాక  విద్యార్థులను  పై తరగతులకు పంపి బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలిస్తున్నారు. 
సామర్థ్యాలేవీ?
 ముందస్తుగానే పై తరగతులకు వెళ్లేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తగిన సామర్థ్యాలు ఉండడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కార్పొరేట్‌, కేంద్రీయ విద్యాలయాల్లో ముందస్తు కసరత్తు ఉండడంతో ఇది సాధ్యమవుతుందని, ప్రభుత్వం హడావుడిగా తీసుక్ను నిర్ణయంతో సత్ఫలితాలు రావనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాలు బోధించేందుకు టీచర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు. వచ్చే నెల17 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన వెంటనే ముల్యాంకనం ఉంటుంది. అలాంటిప్పుడు పదో తరగతి పాఠ్యాంశాలను ఎవరితో బోధిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 
 
ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు
– వి.కరుణానిధిమూర్తి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
వార్షిక పరీక్షలు ముందుగానే నిర్వహించి, విద్యార్థులను పై తరగతికి పంపించాలనే ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదు. ఎలాంటి ముందస్తు  కసరత్తు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. 
 
అన్ని వసతులు కల్పించాలి
– తిమ్మన్న, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ముందుగానే వార్షిక పరీక్షలు నిర్వహించి పై తరగతులకు పంపడం మంచిదే. అయితే పై తరగతులకు వెళ్లే విద్యార్థులకు అన్ని వసతలు కల్పించాలి. పుస్తకాలు ముందుగానే ఇవ్వాలి. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.
 
 ఈ ఏడాది నుంచి మార్చిలోనే వార్షిక పరీక్షలు
                        – తాహెరా సుల్తానా, డీఈఓ
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలు తీసుకవచ్చింది. ఇందులో భాగంగా 1నుంచి9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు మార్చిలోనే నిర్వహించాలని ఇటీవలే కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ పరీక్షలు అయ్యాక పై తరగతులకు సంబంధించిన పాఠాలు బోధించాలని చెప్పాం. ఈ విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోందిది. త్వరలోనే పూర్తిస్థాయి విధి విధానాలు రానున్నాయి.
 

Advertisement
Advertisement