పొదుపు ఖాతాలో లక్షపైనుంటే ‘వడ్డీ’ కోత

1 May, 2019 00:35 IST|Sakshi

ఎస్‌బీఐ నిర్ణయం; నేటి నుంచే అమలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో (ఎస్‌బీఐ) మీకు పొదుపు ఖాతా (సేవింగ్స్‌ అకౌంట్‌) ఉందా? ఇప్పటివరకూ ఈ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా.. కస్టమర్‌కు వడ్డీ 3.5 శాతం అందేది. ఈ ఖాతాలో రూ.లక్ష దాటి ఉంటే వడ్డీరేటును ఎస్‌బీఐ తాజాగా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ తరహా కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. బుధవారం నుంచే తాజా రేటు అమల్లోకి వస్తోంది. అయితే ఈ ఖాతాలో లక్షలోపు ఉంటే వడ్డీరేటు 3.5 శాతంగానే కొనసాగుతుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటుకు  (బ్యాంకులకు స్వల్ప కాలానికి తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) అనుసంధానం చేస్తూ,  ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. వడ్డీ త్రైమాసికం ప్రాతిపదికన చెల్లించడం జరుగుతుంది. 2018 డిసెంబర్‌ నాటికి ఎస్‌బీఐ దేశీయ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్ల విలువ దాదాపు రూ.10.64 లక్షల కోట్లు. 

మరిన్ని వార్తలు