34 వేల పాయింట్లపైకి సెన్సెక్స్‌

13 Apr, 2018 01:07 IST|Sakshi

ఐటీ షేర్ల ర్యాలీ

ప్రపంచ ప్రతికూలతలు  పట్టని మార్కెట్‌ 

161 పాయింట్లు   పెరిగి 34,101కు సెన్సెక్స్‌

42 పాయింట్ల లాభంతో   10,459కు నిఫ్టీ   

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఐటీ షేర్ల ర్యాలీతో మన స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34 వేల పాయింట్లపైన, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,450 పాయింట్లపైన ముగిశాయి. భారత్‌లో ఆర్థిక వృద్ధి పుంజుకోవడం సానుకూలమని మూడీస్‌ సంస్థ వ్యాఖ్యానించడం, గత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి పెరగగలదన్న అంచనాలను వెలువరించడం సానుకూల ప్రభావం చూపించాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానుండడంతో (మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి) ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో లాభాలు తగ్గాయి. సెన్సెక్స్‌ 161 పాయింట్లు లాభపడి 34,101 పాయింట్ల వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 10,459 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు రెండూ ఆరు వారాల గరిష్ట స్థాయికి చేరాయి.  వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. ఈ ఆరు సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,082 పాయింట్లు లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. 

సిరియా విషయమై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు ముదురుతుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రతికూలతను మన మార్కెట్‌ పట్టించుకోలేదు. బుధవారం వరకూ దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరుగా కొనసాగడం, విదేశీ ఫండ్స్‌ తాజాగా కొనుగోళ్లు జరపడం, కంపెనీల క్యూ4 ఫలితాలపై ఆశావహ అంచనాలు లాభాలకు ప్రధాన కారణాలు..లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో  237 పాయింట్ల లాభంతో 34,177 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 16 పాయింట్ల నష్టంతో 33,925 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. ఐటీ షేర్ల జోరు: డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడడం, నేడు(శుక్రవారం) ఇన్ఫోసిస్‌ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 4 శాతం రేంజ్‌లో పెరిగాయి.  

మరిన్ని వార్తలు