ఉద్రిక్తతలు తగ్గాయ్‌...లాభాలు వచ్చాయ్‌

6 Mar, 2019 05:47 IST|Sakshi

అంతర్జాతీయ సంకేతాలు అంతంతే...అయినా మన మార్కెట్‌ ముందుకే 

తగ్గిన ముడి చమురు ధరలు

పుంజుకున్న రూపాయి 

379 పాయింట్లు పెరిగి 36,443కు సెన్సెక్స్‌

124 పాయింట్ల లాభంతో 10,987కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్లో మంగళవారం కొనుగోళ్లు జోరుగా సాగాయి. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం సెలవు కావడంతో  మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం మొదలైన స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలే సాదించింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ,  మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. వాహన, ఆర్థిక, ఇంధన, లోహ రంగ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్‌ 379 పాయింట్లు పెరిగి 36,443 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 10,987 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ ఇంట్రాడేలో మళ్లీ 11,000 పాయింట్లపైకి ఎగబాకింది. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.   

530 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. తర్వాత  నష్టాల్లోకి జారిపోయింది. 137 పాయింట్లు నష్టపోయింది. కొనుగోళ్ల జోరుతో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 393 పాయింట్లు లాభపడింది.  రోజంతా 530 పాయింట్ల రేంజ్‌లో తిరిగింది. అయితే భారత్‌కు ప్రాధాన్యత వాణిజ్య దేశం హోదాను రద్దు చేయాలని అమెరికా యోచిస్తోందన్న వార్తల కారణంగా లాభాలు తగ్గాయి. కాగా దీనివల్ల అమెరికాకు ఎగుమతులపై ప్రభావం ఉండదని భారత్‌  అంటోంది.

టాటా మోటార్స్‌ రయ్‌...
టాటా మోటార్స్‌ షేర్‌ 7.7 శాతం లాభంతో రూ.194 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌లో వాటా విక్రయ వార్తలను కంపెనీ ఖండించడం, అమెరికాలో ఫిబ్రవరి జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు అంచనాలను మించడం వంటివి ఇందుకు కారణం.

మార్కెట్‌ జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.45 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1,44,27,254 కోట్లకు పెరిగింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా