మార్కెట్లకు వారమంతా నష్టాలే!

16 Feb, 2019 00:34 IST|Sakshi

మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు

ఏడో రోజూ కొనసాగిన స్టాక్‌ సూచీల పతనం  

చివరి గంటలో కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు  

67 పాయింట్లు క్షీణించి 35,809కు సెన్సెక్స్‌

22 పాయింట్లు తగ్గి 10,724కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు వరుసగా ఏడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగాయి. అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఫార్మా, లోహ, వాహన, బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి. అయితే చివరి గంటలో విద్యుత్తు, ఇంధన, పీఎస్‌యూ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో 365 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్‌ చివరకు 67 పాయింట్ల నష్టంతో 35,809 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 10,724 పాయింట్ల వద్ద ముగిశాయి. గత  ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,166 పాయింట్లు నష్టపోయింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 737 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు చొప్పున క్షీణించాయి. రెండు సూచీలు చెరో 2 శాతం పతనమయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌ 26 తర్వాత ఇదే అత్యంత అధ్వాన వారం వారీ పతనం. 

512 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ 
అమెరికాలో రిటైల్‌ అమ్మకాలు బలహీనంగా ఉన్నాయన్న గణాంకాలు, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం జరుగుతున్న చర్చల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడం  ప్రపంచ మార్కెట్లపై గణనీయంగానే ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు పెరగడంతో డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు నష్టపోవడం(ఇంట్రాడేలో) కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్లు 0.5 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా మొదలైనా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 147 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 365 పాయింట్ల వరకూ పతనమైంది.  రోజంతా 512 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 40 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 126 పాయింట్లు నష్టపోయింది. 

తీవ్ర హెచ్చుతగ్గుల్లో డాక్టర్‌ రెడ్డీస్‌..
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడేలో 30 శాతం పతనమై రూ.1,873ను తాకిన ఈ షేర్‌ చివరకు ఈ నష్టాలను రికవరీ చేసుకుని 4 శాతం నష్టంతో రూ.2,563 వద్ద ముగిసింది. ఇటీవల అమెరికా ఎఫ్‌డీఏ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు చెందిన  హైదరాబాద్‌ ప్లాంట్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీలో 11 పరిశీలనలను ఎఫ్‌డీఏ గుర్తించిందని అంతర్జాతీయ రీసెర్చ్‌ సంస్థ, జెఫరీస్‌ వెల్లడించింది. ‘అండర్‌ పెర్ఫామ్‌’ రేటింగ్‌ను కొనసాగిస్తునే టార్గెట్‌ ధరను రూ.2,667 నుంచి రూ.2,180కు తగ్గించింది. .  
►సన్‌ ఫార్మా 4 శాతం నష్టపోయి రూ.423 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. 
►ఈ క్యూ3లో నికర లాభం 65 శాతం పెరగడంతో ఓఎన్‌జీసీ షేర్‌ 2.2 శాతం లాభంతో రూ.135 వద్ద ముగిసింది. 
►దాదాపు 400కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, భారత్‌ ఫోర్జ్, ఆర్వింద్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా కెమికల్స్, వేదాంత వంటి షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 
►బుధవారం దాదాపు 30 శాతం పెరిగిన యస్‌బ్యాంక్‌ షేర్‌లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. రూ.219 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు