ఆల్‌టైమ్‌ హైకి సెన్సెక్స్‌

21 Nov, 2019 05:53 IST|Sakshi

క్యాబినెట్‌ మీట్‌ నేపథ్యంలో కొనుగోళ్లు 

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు 

అయినా మన మార్కెట్‌కు లాభాలు 

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకు సెన్సెక్స్‌ 

182 పాయింట్లతో 40,652కు అప్‌

59 పాయింట్లు పెరిగి 11,999కు నిఫ్టీ  

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా,  రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను  తాకిన సెన్సెక్స్‌ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు 2 పాయింట్లు తక్కువ. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌కు ఒక పాయింట్‌ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.
 
రోజంతా లాభాలే..:
లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 346 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్‌ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్రాడేలో 12,000 పాయింట్ల ఎగువకు ఎగబాకడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో మధ్యాహ్న లాభాలు తగ్గాయి. ఇంధన, ఫార్మా, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు లాభపడగా,రియల్టీ, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లు నష్టపోయాయి.

కొనసాగిన ‘రిలయన్స్‌’ రికార్డ్‌లు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది.  షేర్‌ ఆల్‌టైమ్‌ హై, మార్కెట్‌ క్యాప్‌ రికార్డ్‌లు బుధవారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో 4.1  శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,572ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చివరకు 2.4 శాతం లాభంతో రూ.1,547 వద్ద ముగిసింది. ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్‌ జియో టారిఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఈ షేర్‌ జోరుగా పెరిగింది. ఇక ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌(ఈ కంపెనీ మొత్తం షేర్లను ప్రస్తుత ధర వద్ద గుణిస్తే వచ్చే మొత్తం) రూ.10 లక్షల కోట్ల మార్క్‌కు చేరువయింది. మార్కెట్‌ ముగిసేనాటికి రూ.9,80,700 కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ గల భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.9,96,415 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్‌ 37 శాతం లాభపడింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ (13,600 కోట్ల డాలర్లు) బ్రిటిష్‌ ఇంధన దిగ్గజం, బీపీపీఎల్‌సీని దాటేసింది. న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌కు ముందు బీపీపీఎల్‌సీ మార్కెట్‌ క్యాప్‌ 13,000 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా