38వేల దిగువకు సెన్సెక్స్‌

24 Jul, 2019 09:04 IST|Sakshi

నాలుగో రోజూ నష్టాలే..!  

ఉత్సాహాన్నివ్వని క్యూ1 ఫలితాలు  

48 పాయింట్ల నష్టంతో 37,983కు సెన్సెక్స్‌  

15 పాయింట్లు తగ్గి 11,331కు నిఫ్టీ

కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు నిస్తేజంగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టపోయింది.ప్రపంచ మార్కెట్లు పెరిగినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ కీలకమైన 38,000 పాయింట్ల దిగువకు పడిపోగా, నిఫ్టీ మాత్రం 11,300 పాయింట్లపైన ముగియగలిగింది. రోజులో ఎక్కువ భాగం లాభాల్లోనే ట్రేడైన సెన్సెక్స్, నిఫ్టీలు చివరి గంటలో  నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48 పాయింట్లు పతనమై 37,983 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 11,331 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, రియల్టీ, విద్యుత్తు, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లు పెరగడంతో నష్టాలు తగ్గాయి. 

319 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల్లోకి వచ్చింది. చివరి గంటలో అమ్మకాలు జోరందుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 187 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 132 పాయింట్ల మేర పడిపోయింది. మొత్తం మీద రోజంతా   319 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. బడ్జెట్‌ నిరాశపరచడం, కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌ శర్మ పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. 

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. ఆర్థిక వృద్ధి జోరును పెంచడానికి యూరోప్‌ కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్ల  మేర తగ్గించగలదన్న అంచనాలతో యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గి 68.94 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.  
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3 శాతం నష్టపోయి రూ.342 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.

నేటి బోర్డ్‌ సమావేశాలు
కెనరా బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్, ఓబెరాయ్‌ రియల్టీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్, కరూర్‌ వైశ్యా బ్యాంక్, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ, లిబర్టీ షూస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, వీ–గార్డ్‌ ఇండస్ట్రీస్, సింజీన్‌ ఇంటర్నేషనల్‌

మరిన్ని వార్తలు