గ్లో‘బుల్’ ర్యాలీ..!

19 Oct, 2016 00:43 IST|Sakshi
గ్లో‘బుల్’ ర్యాలీ..!

సెన్సెక్స్ 521 పాయింట్లు జూమ్.. 28,051 వద్ద ముగింపు
ఐదు నెలల్లో ఒకేరోజు ఇన్ని పాయింట్లు పెరగడం ఇదే ప్రధమం
8,600 పాయింట్లపైన నిఫ్టీ..158 పాయింట్ల లాభంతో 8,678కు చేరిక
ప్రపంచ ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లలో ర్యాలీల ప్రభావం
జోష్‌నిచ్చిన జీఎస్‌టీ సమావేశ ప్రారంభం

ముంబై: స్టాక్ మార్కెట్లో దీపావళి పండుగకు ముందే  పటాసులు పేలాయి. లాభాల వెలుగుల్లో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. జీఎస్‌టీ రేట్లను నిర్ణయించే కీలకమైన మూడు రోజుల సమావేశం ప్రారంభం కావడం, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 28వేలు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,600 పాయింట్ల పైన ముగిశాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 28,051 పాయింట్ల వద్ద, నిఫ్టీ 158 (1.85 శాతం)పాయింట్లు లాభపడి 8,678 పాయింట్ల వద్ద ముగిశాయి.  సెన్సెక్స్... ఐదు నెలల కాలంలో ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పెరగడం ఇదే మొదటిసారి.

రోజంతా లాభాలే...
జీఎస్‌టీ రేట్లను నిర్ణయించే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం, షార్ట్ కవరింగ్ సానుకూల ప్రభావం చూపాయి. తాజా రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు తగ్గడంతో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు కూడా తోడయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం రికవరీ కావడం కూడా తోడ్పడింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడంతో లాభాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ ముగింపు సమయానికి 28వేల పాయింట్ల మార్క్‌ను దాటింది.

 బ్యాంక్ షేర్ల జోరు...
బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. సోమవారం 7% లాభపడిన ఐసీఐసీఐ జోరు మంగళవారం కూడా కొనసాగింది. ఈ షేర్ టార్గెట్ ధరను రూ.285 నుంచి రూ.325కు నొముర సంస్థ పెంచిన నేపథ్యంలో ఈ షేర్ 4.5% లాభపడి రూ. 270 వద్ద ముగిసింది.  యాక్సిస్ బ్యాంక్ 2.5%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.5%, ఎస్‌బీఐ 1.5% చొప్పన పెరిగాయి. జీఎస్‌టీ సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో పది  లాజిస్టిక్స్ షేర్లు లాభపడ్డాయి. స్నోమన్ లాజిస్టిక్స్, గతి, ఆల్‌కార్గో లాజిస్టిక్స్, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ తదితర షేర్లు 5% వరకూ లాభపడ్డాయి.

రెండు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు..
30 సెన్సెక్స్ షేర్లలో రెండు (ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్) మినహా మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 6 శాతం పెరిగింది. సెన్సెక్స్ షేర్లలో బాగా లాభపడిన షేర్ ఇదే.  హెచ్‌డీఎఫ్‌సీ, 3.8 శాతం పెరిగింది. ఐటీసీ, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, లు 1.5-3 శాతం రేంజ్‌లో పెరిగాయి. బీఎస్‌ఈలో 1,905 షేర్లు లాభాల్లో, 926 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

ప్రపంచ ర్యాలీలతో జోష్...
గత రెండు వారాల్లో మార్కెట్ పతనం కారణంగా పలు షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండడంతో కొనుగోళ్లు బాగా జరిగాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. మంగళవారం ప్రారంభమైన జీఎస్‌టీ సమావేశంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందనే అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయని వివరించారు. కమోడిటీ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో వచ్చిన ర్యాలీలు సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయని ఇదే సంస్థకు చెందిన చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. డాలర్ తగ్గడం.. క్రూడ్, లోహాల ధరలు కూడా పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపాయని బీఎన్‌పీ పారిబా ఫండ్ మేనేజర్(ఈక్విటీస్) శ్రేయాస్ దేవాల్కర్ చెప్పారు.

సెన్సెక్స్ పరుగు ఎందుకంటే..
జీఎస్‌టీ జోష్: జీఎస్‌టీరేట్లను నిర్ణయించే మూడు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభం కావడం, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్‌టీని అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని మార్కెట్ భావించింది. ఇది సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది.
ఒక శాతానికే క్యాడ్: గత ఏడాది వాణిజ్య లోటు బాగా తగ్గడంతో ఈ ఏడాది కరంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1 శాతానికే పరిమితం కాగలదన్న ఒక ప్రైవేట్ నివేదిక ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో ఉత్సాహాన్ని నింపింది.
రూపాయి రికవరీ:  డాలరుతో రూపాయి మారకం విలువ రికవరీ అయింది. ఇంట్రాడేలో రూపాయి 21 పైసలు బలపడింది.
ప్రపంచ మార్కెట్ల జోరు: జపాన్ నికాయ్, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్, షాంగై కాంపొజిట్ షేర్లు 0.3-1.4% రేంజ్‌లో పెరిగాయి. ఆసియా మార్కెట్ల లాభాల నేపథ్యంలో యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.
షార్ట్ కవరింగ్: మూడురోజులపాటు స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయిన నేపథ్యంలో ధరలు ఆకర్షణీయంగా ఉండడంతో ట్రేడర్లు తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకున్నారు.
ఇన్వెస్టర్ల కొనుగోళ్లు: పలు బ్లూ చిప్ షేర్లు  ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు  భారీగా కొనుగోళ్లు జరిపారు.
రేట్ల కోత ఆశలు: రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు తగ్గడంతో కుదేలై ఉన్న పారిశ్రామిక రంగానికి జోష్‌నివ్వడానికి ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు