లాభాల స్వీకరణతో మార్కెట్‌ పతనం

30 May, 2018 01:54 IST|Sakshi

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

బలహీనంగా రూపాయి, అంతర్జాతీయ సంకేతాలు

216 పాయింట్ల నష్టంతో 34,949కు సెన్సెక్స్‌

55 పాయింట్లు పతనమై 10,633కు నిఫ్టీ

మూడు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో లాభపడిన బ్యాంక్‌ షేర్లతో పాటు ఇతర షేర్లలో కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, రూపాయి మళ్లీ పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో స్టాక్‌ సూచీలు నష్టపోయాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 216 పాయింట్ల నష్టంతో 34,949 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,633 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు బాగా పడిపోగా, రూపాయి క్షీణించడంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 821 పాయింట్లు లాభపడింది. ఇటలీ, స్పెయిన్‌లో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.

లాభాల్లోంచి నష్టాల్లోకి....
సెన్సెక్స్‌ 35,234 పాయింట్ల వద్ద లాభాల్లో అరంభమైంది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో ఇంట్రాడేలో 67 పాయింట్ల లాభంతో 35,234 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం, అంతర్జాతీయ సంకేతాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

దీంతో అమ్మకాలు జోరుగా సాగడంతో సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 243 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో 34,922 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 310 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, బ్యాంక్‌ షేర్ల పతనంతో మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు