సెన్సెక్స్ 630 డౌన్..

13 May, 2015 02:02 IST|Sakshi
సెన్సెక్స్ 630 డౌన్..

కీలక బిల్లుల ఆమోదంపై ఎఫ్‌ఐఐల ఆందోళన      
రూపాయి పతనం ప్రభావం

జీఎస్‌టీ, భూ సేకరణ వంటి కీలక బిల్లుల ఆమోదం... తత్సబంధ సంస్కరణల్లో జాప్యంపై ఎఫ్‌ఐఐల ఆందోళన... ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు... వెరసి 2 రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 64కు దిగువకు తగ్గడం కూడా ప్రభావం చూపించింది. అన్ని రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో  స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల పాలయ్యాయి.  మార్చి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెల్లడయ్యాయి) ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు కూడా ప్రభావం చూపాయి.  దీనితో సెన్సెక్స్ 630 పాయింట్ల  నష్టంతో 26,877 వద్ద,   నిఫ్టీ 198 పాయింట్లు క్షీణించి 8,127 పాయింట్ల వద్ద ముగిశాయి.
 
బాండ్ల మార్కెట్ ఒడిదుడుకుల ఎఫెక్ట్...

అంతర్జాతీయంగా బాండ్ల మార్కెట్‌లో ఒడిదుడుకులు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. గ్రీస్ సంక్షోభం నేపధ్యంలో యూరోపియన్ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం మన మార్కెట్లను మరింతగా నష్టాలపాల్జేసింది.
 
13 రోజులు...19,000 కోట్ల అమ్మకాలు
గత 13 రోజుల ట్రేడింగ్‌లో ఎఫ్‌ఐఐలు నగదు విభాగంలో రూ.13,000 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.6,000 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. నెల రోజుల వ్యవధిలో చైనాలో 30 ఐపీఓలు రానున్నాయి. ఈ ఐపీఓల లిస్టింగ్‌లో లాభాలు బాగా వస్తాయనే అంచనాలతో ఈ ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడానికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు పాల్పడుతున్నారని నిపుణులంటున్నారు.
 
లాభ నష్టాలు ఇలా...
సెన్సెక్స్ 30లో డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో కార్ప్‌లు మాత్రమే లాభపడ్డాయి., బ్యాంక్ షేర్లు క్షీణించాయి. సోమవారం బాగా పెరిగిన మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. 1,962 షేర్లు నష్టాల్లో, 746 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,143 కోట్లుగా,  ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,692 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,59,310 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,329 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,332 కోట్ల కొనుగోళ్లు జరిపారు.
 
2 లక్షల కోట్లు ఆవిరి...
ఇన్వెస్టర్ల సంపద మంగళవారం ఒక్క రోజే రూ.2 లక్షల కోట్లు ఆవిరైంది. దీంతో బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.99,05,243కోట్లకు తగ్గింది.
 
ముగిసిన ఎల్‌ఎన్‌జీ సబ్సిడీ వేలం
న్యూఢిల్లీ: దిగుమతైన ఎల్‌ఎన్‌జీపై పవర్ ప్లాం ట్లు ప్రభుత్వ సబ్సిడీ పొందేందుకు ఉద్దేశించిన వేలం మంగళవారంతో ముగిసింది. మూడు సంస్థలు అత్యంత కనిష్టంగా యూని ట్‌కు రూ.1.42 సబ్సిడీకి బిడ్లు దాఖలు చేశాయి. మరో ఏడు సంస్థలు రూ.1.44 చొప్పున, ఒకటి రూ. 1.45 చొప్పున బిడ్ వేశాయి. ప్రభుత్వ సబ్సిడీ పొందేందుకు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో తదితర దిగ్గజాలు వేలంలో పోటీపడ్డాయి. రోజుకు 8.9 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ కేటాయింపులకు సంబంధించి యూనిట్‌కు రూ. 1.74 చొప్పున వేలం ప్రారంభమైంది.

ఈ వేలంలో గెలుపొందిన సంస్థల పేర్లను ప్రభుత్వం వెల్లడించలేదు.  కేంద్రం రూ. 792 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించనున్నట్లు విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శి చౌబే తెలిపారు. గ్యాస్ కొరతతో అల్లాడుతున్న కొన్ని విద్యుత్ ప్లాంట్లు ఖరీదైన ఇంపోర్టెడ్ ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ను కొనుగోలు చేయడానికి తోడ్పాటు అందించే ఉద్దేశంతో వాటికి సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందుకోసం పవర్ సిస్టం డెవలప్‌మెంట్ ఫండ్ (పీఎస్‌డీఎఫ్)ను ఏర్పాటు చేసింది. యూనిట్‌కు రూ. 5.50 రేటున పీఎస్‌డీఎఫ్ నుంచి అత్యంత తక్కువ సబ్సిడీని ఆశించే సంస్థలకు.. మిగతా వాటికన్నా ముందుగా ఎల్‌ఎన్‌జీ లభిస్తుంది. దిగుమతైన ఎల్‌ఎన్‌జీలో పూర్తిగా నిల్చిపోయిన విద్యుత్ ప్లాంట్లకు ఇచ్చే వాటా పోగా, 1.1 ఎంసీఎండీ పరిమాణాన్ని అంతంతమాత్రం సామర్థ్యంతో పనిచేస్తున్న ప్లాంట్లకు అందిస్తారు.
 
ఎఫ్‌ఐఐల పరిమితి పెంచనున్న నాట్కో
నాట్కో ఫార్మా నిధుల సేకరణలో భాగంగా తాజా షేర్లు, కన్వర్టబుల్ సెక్యూరిటీల జారీ ద్వారా ఎఫ్‌ఐఐల పరిమితిని 49% వరకు పెంచాలని భావిస్తోంది. సంస్థలో అనుబంధ కంపెనీ అయిన నాట్కో ఆర్గానిక్స్ విలీనంపైనా మే 22న బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కంపెనీలో ఎఫ్‌ఐఐల వాటా 9.96%
 
ఆదిత్య బిర్లా చేతికి జూబిలెంట్ రిటైల్ వ్యాపారం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రిటైల్ (ఏబీఆర్‌ఎల్) తాజాగా జూబిలెంట్ ఇండస్ట్రీస్‌కి చెందిన హైపర్‌మార్కెట్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం పూర్తిగా నగదు వెచ్చించినప్పటికీ.. డీల్ విలువ మాత్రం వెల్లడించలేదు. రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ దశను సూచిస్తూ.. గడిచిన పక్షం రోజుల్లో కుదిరిన ఒప్పందాల్లో ఇది మూడోది. జూబిలెంట్ హైపర్‌మార్కెట్ ‘టోటల్ సూపర్‌స్టోర్ బిజినెస్’ 2.87 లక్షల చ.అడుగుల మేర విస్తీర్ణంలో కార్యకలాపాలు సాగిస్తోంది.

మరిన్ని వార్తలు