రికవరీ ఆశలతో..

22 May, 2020 04:12 IST|Sakshi

చివర్లో అమ్మకాలతో లాభాలకు కళ్లెం 

114 పాయింట్లు పెరిగి 30,933కు సెన్సెక్స్‌ 

40 పాయింట్ల లాభంతో 9,106కు నిఫ్టీ

ఆర్థిక కార్యకలాపాలు ఆరంభమై, మెల్లమెల్లగా పుంజుకుంటుండటంతో రికవరీపై ఆశలతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, మన సూచీలు ముందుకే దూసుకుపోయాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, వాహన, లోహ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్‌. నిఫ్టీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 370 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 114 పాయింట్ల లాభంతో 30,933 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్లు ఎగసి 9,106 పాయింట్ల వద్దకు చేరింది.  

తగ్గిన లాభాలు...
రైలు, విమాన ప్రయాణాలకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. అయితే యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడం, వీక్లీ నిఫ్టీ డెరివేటివ్స్‌ ముగింపు కావడంతో మన దగ్గర ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అమెరికా–చైనాల మధ్య సంబంధాలు మరింత అధ్వానం కావడం, ఆర్థిక రంగ షేర్లలో చివరి అరగంటలో అమ్మకాలు సాగడం....ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దక్షిణ కొరియా మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు 1 శాతం మేర క్షీణించాయి.  

► దాదాపు నెల రోజుల తర్వాత సిగరెట్ల ఉత్పత్తిని ప్రారంభించడంతో ఐటీసీ షేర్‌ 7 శాతం లాభంతో రూ.189 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  

► సోమవారం(ఈ నెల 25) నుంచి విమాన సర్వీసులు ఆరంభం కానుండటంతో విమానయాన షేర్లు పెరిగాయి. ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో) షేర్‌ 7 శాతం లాభంతో రూ.978 వద్ద, స్పైస్‌జెట్‌ 5 శాతం లాభంతో రూ.43 వద్ద ముగిశాయి.  

► అశోక్‌ లేలాండ్, హీరో మోటొ, మారుతీ, బజాజ్‌ ఆటో 2–6% రేంజ్‌లో పెరిగాయి.

రెండో రోజూ రిలయన్స్‌ ఆర్‌ఈల జోరు
రిలయన్స్‌కు చెందిన రైట్స్‌ ఎన్‌టైటిల్మెంట్‌(ఆర్‌ఐఎల్‌–ఆర్‌ఈ) జోరు రెండో రోజు కూడా కొనసాగింది. ఇంట్రాడేలో 28% లాభంతో రూ.258ను తాకిన ఈ ఆర్‌ఈ చివరకు 16% లాభంతో రూ.234 వద్ద ముగిసింది. బుధవారం ఆరంభమైన రిలయన్స్‌  రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూ వచ్చే నెల 3న ముగియనున్నది. ఆర్‌ఈల ట్రేడింగ్‌ ఈ నెల 29 వరకూ జరుగుతుంది. ఈ ఆర్‌ఈలను కొనుగోలు చేసిన వాళ్లు రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ షేర్లను పొందవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా