మళ్లీ 11,000 పైకి నిఫ్టీ

7 Feb, 2019 04:19 IST|Sakshi

ఐదో రోజూ కొనసాగిన లాభాలు

ఆర్‌బీఐ వైఖరి మారొచ్చని అంచనా

అన్ని రంగాల షేర్లలో కొనగోళ్లు

358 పాయింట్ల లాభంతో 36,975కు సెన్సెక్స్‌

128 పాయింట్లు పెరిగి 11,062కు నిఫ్టీ...

కీలక రేట్ల విషయమై ఆర్‌బీఐ విధానం మారవచ్చనే అంచనాలతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. వడ్డీ రేట్ల ప్రభావిత రంగ షేర్లతో పాటు ఇతర రంగాల షేర్లలో కూడా కొనుగోళ్లు జోరుగా సాగాయి. స్టాక్‌ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడ్డాయి. స్టాక్‌ సూచీలు రెండూ ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,000  పాయింట్లపైకి ఎగబాకగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 37,000 పాయింట్లపైకి చేరింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 358 పాయింట్లు పెరిగి 36,975 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 11,062 పాయింట్ల వద్ద ముగిశాయి.  

నేడు ఆర్‌బీఐ పాలసీ..
మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు (గురువారం) ముగియనుంది. కీలక రేట్లపై నిర్ణయాన్ని ఆర్‌బీఐ నేడు వెల్లడిస్తుంది. రేట్ల కోత ఉండకపోవచ్చని, అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుండటంతో రేట్ల విషయమై ఆర్‌బీఐ వైఖరి ‘తటస్థ’ విధానానికి మారవచ్చని అంచనాలున్నాయి. బాండ్ల రాబడులు తగ్గడం, రూపాయి స్వల్పంగా బలపడటం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముడి చమురు ధరలు తగ్గడం, ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధించగలమని కేంద్రం పేర్కొనడం... సానుకూల ప్రభావం చూపించాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 388 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. జపాన్‌ మార్కెట్‌ స్వల్పంగా పెరగ్గా, చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు చాంద్రమాన కొత్త సంవత్సరాది కారణంగా పనిచేయలేదు. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి.  

ఆల్‌టైమ్‌ హైకి టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌
ఈ క్యూ3లో నికర లాభం 28 శాతం పెరగడంతో టెక్‌ మహీంద్రా షేర్‌ భారీగా లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.814ను తాకిన ఈ షేర్‌ చివరకు 8 శాతం లాభంతో రూ.811 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5,995 కోట్లు పెరిగి రూ.79,588 కోట్లకు ఎగసింది. ఈ షేర్‌తో పాటు ఇన్ఫోసిస్, దివీస్‌ ల్యాబ్స్, యాక్సిస్‌ బ్యాంక్, బాటా ఇండియా తదితర షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.

ఆగని అనిల్‌ షేర్ల పతనం...
అనిల్‌ అంబానీ షేర్ల పతనం కొనసాగింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేర్‌ ఇంట్రాడేలో 38 శాతం క్షీణించి రూ.142ను తాకింది. చివరకు 32 శాతం నష్టంతో రూ.154  వద్ద ముగిసింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్‌ ఇంట్రాడేలో 11 శాతం తగ్గి ముఖ విలువ రూ.5 కంటే దిగువకు, రూ.4.85ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.5.48 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇతర గ్రూప్‌ కంపెనీలు–రిలయన్స్‌ పవర్‌ 14 శాతం, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 12 శాతం, రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 11 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రిలయన్స్‌ నిప్పన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ షేర్‌ మినహా అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఆరు షేర్లు 22 శాతం నుంచి 53 శాతం రేంజ్‌లో పడిపోయాయి.  

మూడు సెన్సెక్స్‌ షేర్లకే నష్టాలు  
31 సెన్సెక్స్‌ షేర్లలో కేవలం మూడు– యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎన్‌టీపీసీ.. మాత్రమే నష్టపోగా మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. స్టాక్‌ సూచీలు భారీగా లాభపడినప్పటికీ, దాదాపు 400 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అరవింద్, ఏబీజీ షిప్‌యార్డ్, ఇక్రా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు