‘మండే’ స్టాక్‌ మార్కెట్‌

18 Sep, 2018 01:56 IST|Sakshi

మరింత ముదిరిన వాణిజ్య ఉద్రిక్తతలు

దీంతో పతనమైన ప్రపంచ మార్కెట్లు

ప్రభావం చూపని ప్రభుత్వ రూపాయి రక్షణ చర్యలు

505 పాయింట్లు పతనమై 37,586కు సెన్సెక్స్‌...

11,400 దిగువకు నిఫ్టీ

137 పాయింట్ల నష్టంతో 11,378కు

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలతో ఆరంభమైంది. రూపాయి పతనం కొనసాగడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదరడంతో ఈ సోమవారం స్టాక్‌ మార్కెట్‌కు మరో బ్లాక్‌ మండేగా మిగిలిపోయింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఐదంశాల ఫార్ములా స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. విదేశీ నిధులు తరలిపోతున్న నేపథ్యంలో స్టాక్‌ సూచీలు భారీగా పతనమయ్యాయి. భారత స్టాక్‌ మార్కెట్ల జోరు ముగిసినట్లేనని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ వ్యాఖ్యానించడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

గత రెండు ట్రేడింగ్‌ లాభాలకు సోమవారం బ్రేక్‌ పడింది. హెవీ వెయిట్‌ షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 2 శాతం వరకూ నష్టపోవడంతో  సెన్సెక్స్‌ మళ్లీ 38,000, నిఫ్టీ 11,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్‌ 505 పాయింట్లు నష్టపోయి 37,586 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 11,378 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే,  సెన్సెక్స్‌ 1.33 శాతం,  నిఫ్టీ 1.19 శాతం చొప్పున పతనమయ్యాయి.  ఐటీ, రియల్టీ సూచీలు  మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, ఫార్మా, వాహన, లోహ షేర్లు నష్టపోయాయి. 

ఆరంభం నుంచి నష్టాలే...
ఆసియా మార్కెట్లు  బలహీనంగా ట్రేడవుతుండటంతో మన మార్కెట్‌ కూడా నష్టాల్లోనే ఆరంభమైంది. ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పతనమైంది. అమ్మకాలు వెల్లువెత్తడంతో 38,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. గంటలు గడుస్తున్న కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ, ఎలాంటి ఊరట లభించలేదు. ఇంట్రాడేలో 542 పాయింట్ల వరకూ పతనమై, 37,549 పాయింట్ల వద్ద  కనిష్టాన్ని తాకింది.

ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 148 పాయింట్ల వరకూ పతనమైంది. కాగా నిఫ్టీ కీలకమైన 11,500 పాయింట్ల దిగువకు పతనమైందని, మరింత పతనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ మార్కెట్ల రాగానికి అనుగుణంగా మన మార్కెట్‌ తాళమేస్తోందని కొందరు నిపుణులు వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో ఈ విషయంలో మార్పు ఉండకపోవచ్చని వారి అంచనా.

పంచదార షేర్ల పరుగులు...
స్టాక్‌ సూచీలు భారీగా పతనమైనప్పటికీ పంచదార షేర్ల పరుగులు మూడో రోజు కూడా కొనసాగాయి.

ఇవే ‘ఏడు’పించాయి..
1. ప్రపంచ మార్కెట్ల పతనం:
2. రూపాయి బలోపేతానికి ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు...
3. దీనితో కొనసాగిన రూపాయి పతనం  
4. భగ్గుమన్న ముడి చమురు ధరలు  
5. భారత్‌ మార్కెట్ల జోరు ముగిసినట్లేనన్న గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక  
6. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీసహా పలు ప్రధాన షేర్లకు భారీ నష్టాలు  
7. తరలిపోతున్న విదేశీ నిధులు   

లక్ష కోట్లకు పైగా సంపద ఆవిరి
సెన్సెక్స్‌ భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.14,676 కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,14,676 కోట్లు ఆవిరై రూ.155 లక్షల కోట్లకు తగ్గింది.  

మరిన్ని వార్తలు