నేడు మార్కెట్ల గ్యాపప్‌ ఓపెనింగ్‌!

8 Jun, 2020 09:00 IST|Sakshi

నిఫ్టీకి 10200-10257 వద్ద రెసిస్టెన్స్‌!

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 90 పాయింట్లు ప్లస్‌

యూఎస్‌, ఆసియా మార్కెట్లు లాభాలతో

నేడు (సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకుని 10,269 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 10,179 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. భారీ సహాయక ప్యాకేజీలు, లాక్‌డవున్‌ ఎత్తివేతల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి జోరందుకోగలదన్న అంచనాలు కొనసాగుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాట పట్టాయి. వెరసి శుక్రవారం యూఎస్‌ మార్కెట్ల లాభాలతో నిలిచాయి. నాస్‌డాక్‌ మరోసారి ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావచ్చని, ఆపై కొంతమేర ఆటుపోట్లకు లోనుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. వారాంతాన ఒక్కరోజులోనే తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. గత గురువారం ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో తిరిగి లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 307 పాయింట్లు జంప్‌చేసి 34,287 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్లు ఎగసి 10,142 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,063 పాయింట్ల వద్ద, తదుపరి 9,983 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,200 పాయింట్ల వద్ద, ఆపై  10,257  వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,573 పాయింట్ల వద్ద, తదుపరి 20,112 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,347 పాయింట్ల వద్ద, తదుపరి 21,660 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 98 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం  ఎఫ్‌పీఐలు రూ. 2905 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 847 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు