నిఫ్టీకి నేడు 9410-9320 వద్ద సపోర్ట్‌!

29 May, 2020 08:58 IST|Sakshi

నేడు నేలచూపుల ఓపెనింగ్‌!

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 16 పాయింట్లు మైనస్‌

యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం డౌన్‌

నేలచూపులో ఆసియా మార్కెట్లు 

నేడు (శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 16 పాయింట్లు తక్కువగా 9,410 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌  ఫ్యూచర్స్‌  9,426  వద్ద ముగిశాయి. అయితే  మే నెల ఫ్యూచర్స్‌ 9491 వద్ద ముగిశాయి. వీటితో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మరింత బలహీనంగా కదులుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా కంపెనీలపై ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను జారీ చేయడంతోపాటు, చైనాపై నేడు విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్న నేపథ్యంలో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం నీరసించాయి. చైనా, హాంకాంగ్‌ వివాదం కారణంగా ప్రస్తుతం పలు ఆసియా మార్కెట్లు నేలచూపులతో ట్రేడవుతున్నాయి. ఇండొనేసియా, చైనా మాత్రం 0.5-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. కాగా..నేడు దేశీయంగా జూన్‌ నెల డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభంకానుంది. అయితే ఇంట్రాడేలో యథాప్రకారం ఆటుపోట్లకు చాన్స్‌ ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

32,000 దాటిన సెన్సెక్స్‌
వరుసగా రెండో రోజు గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపాయి. బుధవారం 1,000 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్‌ గురువారం మరో 595 పాయింట్లు బలపడింది. వెరసి 32,000 పాయింట్ల మార్క్‌ను సులభంగా దాటేసింది. 32,200 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద నిలిచింది. మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ చివరి రోజు సైతం ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టడంతో ఇండెక్సులు బేర్‌ ర్యాలీ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 


నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 9410 పాయింట్ల వద్ద, తదుపరి 9320 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,590 పాయింట్ల వద్ద, ఆపై 9,690 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 18900 పాయింట్ల వద్ద, తదుపరి 18560 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ ఫ్టీకి తొలుత 19420 పాయింట్ల వద్ద, తదుపరి 19730 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2354 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 145 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 335 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2409 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4716 కోట్లు, డీఐఐలు రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు