నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌- ఆపై దారెటు?!

20 Jul, 2020 08:36 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 10,790-10,678 వద్ద సపోర్ట్స్‌

శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటూ

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు ప్రతికూలం

నేడు (20న) దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప వెనకడుగుతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించి 10,910 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,931 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 కట్టడికి మోడర్నా, బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేస్తున్నవ్యాక్సిన్‌లపై అంచనాతో శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అత్యధిక శాతం నష్టాలతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగాగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా రెండు రోజుల లాభాల ఓపెనింగ్‌ ట్రెండ్‌కు బ్రేక్‌ పడవచ్చని ఊహిస్తున్నారు. దీంతోపాటు ఇంట్రాడేలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు భావిస్తున్నారు. 

మార్కెట్ల హైజంప్‌
చివరి గంటలో బుల్‌ ఆపరేటర్లు కదం తొక్కడంతో శుక్రవారం దేశీ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ 37,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 548 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్‌ 37,020 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 162 పాయింట్లు ఎగసి 10,902 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,790 పాయింట్ల వద్ద, తదుపరి 10,678 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,974 పాయింట్ల వద్ద, ఆపై 11,045 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,657 పాయింట్ల వద్ద, తదుపరి 21,347 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,171 పాయింట్ల వద్ద, తదుపరి 22,375 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 697 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 209 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1091 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  డీఐఐలు రూ. 1660 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు