సిమ్‌ ధ్రువీకరణకు మరింత గడువు!

23 Nov, 2017 00:31 IST|Sakshi

యూఐడీఏఐని కోరిన టెల్కోలు

న్యూఢిల్లీ: మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సిమ్‌ రీ వెరిఫికేషన్‌ (ఆధార్‌తో ధ్రువీకరణ)కు ఓటీపీ వంటి కొత్త విధానాల అమలుకు మరింత సమయం కావాలని సెల్యులర్‌ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ తాజాగా యూనిక్యూ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)ను కోరింది. టెల్కోలు సిమ్‌ రీ వెరిఫికేషన్‌కు కొత్త విధానాలను డిసెంబర్‌ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. ‘‘నిర్ణీత గడువు నుంచి కొత్త విధానాల్లో సిమ్‌ రీ వెరిఫికేషన్‌ను ప్రారంభించడం కష్టసాధ్యం. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను అమలు చేయడానికి మేం ఇంకా పూర్తిగా సన్నద్ధం కాలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే యూఐడీఏఐకి, టెలికం డిపార్ట్‌మెంట్‌కు తెలియజేశాం’’ అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ వివరించారు. ఎస్‌ఎంఎస్‌ ఆధారిత వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ‘‘కొత్త విధానంలో కస్టమర్‌ అక్వైజిషన్‌ ఫామ్‌ (సీఏఎఫ్‌)లో మార్పులు అవసరమౌతాయి. టెలికం డిపార్ట్‌మెంట్‌ నుంచి ఆదేశాలు వెలువడిన దగ్గరి నుంచి ఆపరేటర్లు వాటిని పాటించడానికి 4–6 వారాల సమయం పడుతుంది’’ అని యూఐడీఏఐకి రాసిన లేఖలో తెలిపారు.

ఓటీపీ ఆధారిత విధానంలో సీఏఎఫ్‌లోని చాలా గళ్లను నింపడం ఆపరేటర్లకు సాధ్యం కాదని, అందుకే ఇందులోనూ మార్పులు తప్పనిసరని పేర్కొన్నారు. టెలికం డిపార్ట్‌మెంట్‌ మార్పులు చేసిన సీఏఎఫ్‌ను జారీ చేయనుందని, దాన్ని టెల్కోలు వినియోగించాల్సి ఉందని తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియనే రీ వెరిఫికేషన్‌గా పేర్కొంటాం. యూజర్లు టెలికం స్టోర్లకు వెళ్లి దీన్ని పూర్తి చేసుకోవచ్చు. వృద్ధులు, వికలాంగులు వంటి వారి విషయంలో టెలికం సంస్థలు తమ ప్రతినిధులను ఇంటి వద్దకే పంపి రీ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెరిఫికేషన్‌ కోసం ఓటీపీ, ఐవీఆర్‌ఎస్, యాప్‌ వంటి విధానాలు పాటించాలని కూడా ఆదేశించింది.

మరిన్ని వార్తలు