కొత్త ఏడాదైనా కాస్త ముందే!!

26 Mar, 2018 01:47 IST|Sakshi

చెల్లించాల్సిన పన్నుపై ముందే అంచనాకు రావాలి

ఆరంభం నుంచే ఆదాకు అడుగులేయాలి 

వివిధ సాధనాలకు కేటాయింపులు అవసరం

ఆరు నెలలు, ఏడాదికోసారి పోర్ట్‌ఫోలియో సమీక్ష

లాభాలు గణనీయంగా ఉంటే ప్రాఫిట్‌ బుకింగ్‌ ఇప్పుడే

వేతన జీవులు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు ప్రతీ ఆర్థిక సంవత్సరం కీలకమైనదే. పన్ను ఆదా కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ప్రారంభం నుంచే చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎక్కువ మంది ఫిబ్రవరి, మార్చి మాసంలో పన్ను ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో అర్హత కలిగిన పథకాలలో ఏదో ఒకదానిలో పెట్టేస్తుంటారు. కానీ, తగిన ప్రణాళికతో తమకు అనువైన, లాభదాయకమైన సాధనాన్ని ముందే ఎంచుకుని ప్రతీ నెలా కొంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళితే ఆ సౌలభ్యమే వేరు. పైగా అదనపు రాబడి. ఈ విధంగా నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దృష్టి సారించాల్సిన అంశాలపై అందిస్తున్న ప్రాఫిట్‌ కథనమే ఇది. – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

తాజా బడ్జెట్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్‌టీసీజీ) పన్నును ప్రవేశపెట్టారు. కాకపోతే జనవరి వరకు ఆర్జించిన లాభాలకు మాత్రం మినహాయింపు (గ్రాండ్‌ఫాథర్డ్‌) కల్పించారు. ఇదో పెద్ద ఉపశమనమే. ఇప్పటికే మీకున్న పెట్టుబడులపై ఎల్‌టీసీజీని లెక్కించే విషయంలో కొంత శ్రమ అవసరమవుతుంది. అందుకే వాటిని ప్రత్యేకంగా ఒక డైరీ లేదా ఎక్సెల్‌ షీటులో పొందుపరచాలి.

ఎల్‌టీసీజీని సులభంగా లెక్కించేందుకు ప్రభుత్వం మినహాయింపు కల్పించిన 2018 జనవరి 31 నాటి షేర్ల క్లోజింగ్‌ ధరలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు సంబంధించి ఎన్‌ఏవీలను నమోదు చేసి ఉంచుకోవాలి. దీంతో ఆ తర్వాత వచ్చిన లాభం నుంచి నాటి క్లోజింగ్‌ ధరలను మినహాయించి మిగిలిన లాభంపైనే పన్ను చెల్లించేందుకు వీలవుతుంది. వ్యాల్యూ రీసెర్చ్‌ వంటి కంపెనీలు ఉచితంగా పోర్ట్‌ఫోలియో ట్రాకర్‌ సేవలను అందిస్తున్నాయి. జనవరి 31 నాటి ధరల ఆధారంగా మీ పెట్టుబడులపై ఎల్‌టీసీజీని ఈ సంస్థల సాఫ్ట్‌వేర్‌ సులభంగా లెక్కించి చూపిస్తుంది.

స్టాక్స్‌లో లాభాల స్వీకరణ
2018 ఏప్రిల్‌ 1 నుంచి దీర్ఘకాలిక లాభాలపై 10 శాతం పన్ను అమల్లోకి వస్తుంది. లాభాలు అధికంగా ఆర్జించి ఉంటే కనుక, మార్చి 31లోపు వాటిని అమ్మేసి లాభాల స్వీకరణ చేయడం తెలివైన నిర్ణయమని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ దీర్ఘకాలిక లాభం ఒక ఏడాదిలో రూ.లక్షలోపు ఉంటే లాభాల స్వీకరణ అవసరం లేదని బీడీవో ఇండియా పార్ట్‌నర్‌ అశ్రుజిత్‌ మండల్‌ పేర్కొన్నారు.

ఒకవేళ మంచి లాభాలు ఆర్జించినప్పటికీ, చక్కని పనితీరు చూపించే స్టాక్స్‌ మీ పోర్ట్‌ఫోలియోలో ఉండి ఉంటే వాటిని మార్చి 31లోపు విక్రయించేసి, కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్‌ వచ్చిన వెంటనే వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. ‘‘జనవరి 31 నాటి ధరల కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతుంటే మంచి పనీతీరు చూపిస్తున్న వాటిని విక్రయించక్కర్లేదు. ఎందుకంటే జనవరి 31 తర్వాత ఆయా షేర్ల ధరల పతనాన్ని స్వల్ప కాలిక మూలధన నష్టంగా పన్ను అధికారులు పరిగణనలోకి తీసుకోరు.

ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోలోని దీర్ఘకాలిక షేర్లు (ఏడాది దాటినవి) కొనుగోలు ధరల కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతుంటే వాటిని ఏప్రిల్‌ 1 వరకు వేచి ఆ తర్వాత విక్రయించుకోవడం వల్ల వచ్చే నష్టాలను దీర్ఘకాలిక లాభాల నుంచి తగ్గించి చూపించుకోవచ్చు’’ అని క్వికో డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు విశ్వజిత్‌ సొనంగర తెలిపారు.

పన్ను రిటర్నులు
ఒకేసారి వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఇక మీదట ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి గడిచిన అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించే రిటర్నులు దాఖలు చేయగలరు. అంటే 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు ఈ మార్చి 31 వరకే అవకాశం.

రిటర్నులకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గానీ జూలై 31లోపు వాటిని దాఖలు చేసి అవసరమైతే మార్చి 31లోపు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని విశ్వజిత్‌ సొనంగర తెలిపారు. రిటర్నులు ఆలస్యం అయితే నష్టాల పరిగణింపు పరంగా సమస్య ఎదురవుతుంది. ఒకవేళ పెట్టుబడులపై నష్టాలు వస్తే, ఆ మేరకు మినహాయింపు పొందాలంటే  సకాలంలో రిటర్నులు ఫైల్‌ చేయాలి. లేదంటే వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదలాయించుకోవాల్సి వస్తుంది.

పోర్ట్‌ఫోలియో సమీక్ష
మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఏడాదికోసారి, ఆరు నెలలకోసారి సమీక్షించుకోవాలని నిపుణుల సూచన. ఆ సమీక్షకు అనుగుణంగా నూతన ఆర్థిక సంవత్సరం నుంచి చర్యలు తీసుకోవాలి. . కేవలం పోర్ట్‌ఫోలియో మార్పునకే సమీక్ష అవసరమని భావించ కూడదు. మీరు వివి ధ సాధనాలకు చేసిన కేటాయింపుల్లో వ్యత్యాసాన్ని గమనించాలి. స్టాక్‌ మార్కెట్‌ గడిచిన రెండేళ్ల కాలంలో ర్యాలీ చేసి ఉన్నందున ఈక్విటీల్లో పెట్టుబడుల విలువ అధికమైతే ఆ మేరకు పోర్ట్‌పోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

పన్ను ప్రణాళిక
పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడులు అనేవి ఆర్థిక సంవత్సరం చివర్లో చూసుకుందాంలేనని చాలా మంది అనుకుంటుంటారు. చివర్లో తమకు సరిపోలని సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఈ విధమైన తప్పుడు నిర్ణయాలకు అవకాశం లేకుండా ఉండాలంటే పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడులను ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే మొదలు పెట్టడం మేలు. ఇందు కోసం తొలుత పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్‌ చేయాలన్నదానిపై స్పష్టతకు రావాలి.

సెక్షన్‌ 80సీ కింద పిల్లల విద్యా ఫీజులు, గృహ రుణ అసలు చెల్లింపులు, బీమా పాలసీలపై ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకసారి 80సీ కింద పన్ను ఆదాకు ఎంత విలువ మేర ఇన్వెస్ట్‌ చేయాలో నిర్ణయించుకుంటే, ఆ తర్వాత దేనికి ఎంత మేర అన్నది కేటాయింపులు చేయాలి. ఈక్విటీ కేటాయింపులు అయితే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో సిప్‌ విధానంలో పెట్టుబడులు కొనసాగించాలి. ఆయా అంశాల్లో స్పష్టమైన అభిప్రాయానికి రావడానికి నిపుణుల సలహాలను తీసుకోవాలి.
వీపీఎఫ్‌ ఫండ్‌
ఇటీవల పీపీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గించినప్పటికీ (8.55 శాతం ప్రస్తుతం) వడ్డీ రేటు ఇప్పటికే ఎక్కువగానే ఉన్నట్టు. రాజకీయ పరమైన కారణాలతో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు మిగిలిన సాధనాల కంటే ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కనుక ఈపీఎఫ్‌ చందాదారులు అదనంగా వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆప్షన్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. దీనిపైనా ఈపీఎఫ్‌ వడ్డీ రేటే అమలవుతుంది. అయితే చాలా కంపెనీలు ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఇందుకు అనుమతిస్తాయనే విషయన్ని గుర్తుంచుకోవాలి.

పేటీఎం ఖాతాదారులకు స్వల్పకాలిక రుణాలు..
మొబైల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం తాజాగా తమ యూజర్లకు స్వల్పకాలికంగా స్వల్పమొత్తాల రుణాలను సమకూర్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకుతో జతకట్టింది. పేటీఎం–ఐసీఐసీఐ బ్యాంక్‌ పోస్ట్‌పెయిడ్‌ పేరిట ఈ సర్వీసు అందించనుంది. ఈ ఒప్పందం కింద.. బిల్లుల చెల్లింపులు, ఫ్లయిట్‌... సినిమా టికెట్స్‌ బుక్‌ చేసుకోవడం మొదలైన వాటి కోసం పేటీఎం ఖాతా ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి డిజిటల్‌ క్రెడిట్‌ పొందవచ్చు.

ఈ రుణమొత్తంపై 45 రోజుల దాకా వడ్డీ ఉండదు. రుణంగా తీసుకున్న మొత్తాన్ని 45 రోజుల్లోగా కట్టేస్తే.. వడ్డీ ప్రసక్తి ఉండదు. ఒకవేళ గడువు దాటితే రూ. 50 లేట్‌ ఫీజుతో పాటు 3 శాతం వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. రుణపరిమితి రూ. 3,000 నుంచి రూ. 10,000 దాకా ఉంటుంది. ఒకవేళ తీసుకున్న రుణమొత్తాన్ని సక్రమంగా చెల్లిస్తూ మంచి ట్రాక్‌ రికార్డు ఉంటే.. రూ. 20,000 దాకా లిమిట్‌ పెంచుకోవచ్చు.  
 
రూ.20 లక్షల దాకా పన్ను రహిత గ్రాట్యుటీ

ఉద్యోగులకు ఊరటనిచ్చే దిశగా పన్ను మినహాయింపు వర్తించే గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ. 10 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 20 లక్షలకు పెంచింది. ఇప్పటిదాకా గ్రాట్యుటీ మొత్తం రూ. 10 లక్షలు దాటిన పక్షంలో పన్నులు వర్తించేవి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ పేమెంట్‌ ఆఫ్‌ గ్రాట్యుటీ (సవరణ) బిల్లు 2018.. అమల్లోకి వస్తుంది. పదిమంది పైగా సిబ్బంది ఉన్న సంస్థలో నిరాటంకంగా అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తిస్తుంది. సర్వీస్‌ పూర్తి చేసుకున్న ప్రతి ఏడాదికి పదిహేను రోజుల జీతం గ్రాట్యుటీ కింద పొందవచ్చు.  

మరిన్ని వార్తలు