స్టార్టప్స్ ఫండ్‌కి రూ. 2,000 కోట్లు..

14 Jul, 2015 23:43 IST|Sakshi
స్టార్టప్స్ ఫండ్‌కి రూ. 2,000 కోట్లు..

సిడ్బి సీఎండీ ఛత్రపతి శివాజీ
 
 ముంబై : స్టార్టప్ సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కోసం రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) సీఎండీ ఛత్రపతి శివాజీ తెలిపారు. అయితే, లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉం టుంది, ఎంత మొత్తం రుణాలు ఇస్తారు తదితర అంశాలను ఆయన వెల్లడించలేదు. స్టార్టప్స్‌కి తోడ్పాటునిచ్చేందుకు బడ్జెట్‌లో కేటాయించిన రూ. 10,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి ఇవ్వనున్నట్లు శివాజీ తెలిపారు. మిగతా రూ. 8,000 కోట్లను తక్కువ వడ్డీ రుణాల కింద ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థలకు నిధులు అందించడంలో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని శివాజీ పేర్కొన్నారు. స్కీము కింద 10-12 శాతం వడ్డీ రేటుకే స్టార్టప్స్, చిన్న ..మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) రుణాలు పొందవచ్చన్నారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఆరుగురు సభ్యులతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ కూడా ఏర్పాటైందని శివాజీ పేర్కొన్నారు. అటు చిన్న సంస్థల రుణాల రీఫైనాన్సింగ్ కోసం ఉద్దేశించిన ముద్రా బ్యాంకు.. సిడ్బీకి పోటీ కాదన్నారు. ముద్రా బ్యాంకుకీ శివాజీనే సారథ్యం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు