ముందు ‘విభజన’ పని | Sakshi
Sakshi News home page

ముందు ‘విభజన’ పని

Published Thu, Mar 13 2014 3:53 AM

ముందు ‘విభజన’ పని - Sakshi

  • ఆ తర్వాత ఎన్నికల పనులు..  మిగతా పనులన్నీ పక్కకు 
  •  అన్ని ప్రభుత్వ శాఖలకు సీఎస్ మహంతి ఆదేశాలు
  •   తెలంగాణ కోసం చట్టబద్ధ పత్రాలను సిద్ధం చేయండి
  •   జూన్ 2న అన్ని రంగాలు రెండుగా విడిపోవాలి
  •   {పాంతాల వారీగా శాఖల ఆదాయం లెక్కగట్టాలి
  •   కేంద్ర వాటాల పంపిణీ నమూనా రూపొందించాలి
  •   రాష్ట్ర విభజన, ఎన్నికల పనులు మినహా మిగతా 
  •   పనులు, ఫైళ్లు అన్నీ పెండింగ్‌లో పెట్టాలి 
  •   {పభుత్వ ప్రధానకార్యదర్శి ప్రత్యేక మెమో జారీ
  •  సాక్షి, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోను జూన్ 2వ తేదీ నాడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రంగాలూ సజావుగా రెండుగా విడిపోవటమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక ప్రధానకార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు బుధవారం ప్రత్యేకంగా మెమో జారీ చేశారు. విభజన పనితో పాటు ఎన్నికల పనులను మాత్రమే అధికార యంత్రాంగం చూడాలని మిగతా విషయాలకు సంబంధించిన ఫైళ్లను పెండింగ్‌లో పెట్టాలని సీఎస్ ఈ ఆదేశాల్లో స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన పనికి అంత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తరువాత లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, మునిసిపల్, జిల్లా, మండల పరిషత్  ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ నిర్దేశించారు. మరోపక్క రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరులను సమకూర్చే శాఖల ఉన్నతాధికారులతో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.పి.సింగ్ బుధవారం సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీచేశారు. ముఖ్యాంశాలివీ...
     
      కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని రంగాల్లో చట్టబద్ధమైన పత్రాలను, నోటిఫికేషన్లను సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖలకు ఆదేశాలు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, పన్నుల వసూళ్లు ఎవరు చేస్తారో వివరిస్తూ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన చట్టబద్ధ పత్రాలను ఏప్రిల్ నెలాఖరుకల్లా రెండు నెలలకు సరిపడా ముందుగా సిద్ధం చేయాలి.
     
      అన్ని రంగాల్లో ఏ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం వస్తోంది? రాష్ట్ర విభజన సంధికాలంలో చట్టపరంగా ఇతరత్రా చిక్కులేమైనా ఎదురవుతాయా? వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు.. కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులు ఎన్ని? వాటిని ఏ విధంగా రెండు రాష్ట్రాలకు విభజించాలో ఫార్ములా సిద్ధం చేయాలి. వివిధ రంగాల్లో పన్నుల బకాయిలు ఎంత ఉన్నాయి? ఆ బకాయిలను ఎవరు వసూలు చేయాలి? ఏ రాష్ట్రానికి అవి చెందుతాయి? అనే వివరాలను సిద్ధం చేయాలి. 
     
      ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని రకాల ఫైళ్లను జిరాక్స్ తీయటానికి జిరాక్స్‌ల కొరత ఏర్పడింది. వేలు, లక్షల సంఖ్యలోని ఫైళ్లు జిరాక్స్ కోసం కొత్త జిరాక్స్ యంత్రాలు కొనుగోలుకు, అద్దెకు తీసుకోవటానికి అవసరమైన బడ్జెట్ నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖ నిర్ణయం. 
      తొలుత కరంట్ (ప్రస్తుత) ఫైళ్లను, ఆ తరువాత క్లోజ్ చేసిన (ముగించిన) ఫైళ్లను, అనంతరం రికార్డు రూమ్‌ల్లోని ఫైళ్లను జిరాక్స్‌లు తీయాలని నిర్ణయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్లను మూడేసి సెట్ల చొప్పున జిరాక్స్‌లు తీస్తారు. 
     
      జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన అధికారిక వెబ్‌సైట్లు పని ప్రారంభిస్తాయి. రెండు రాష్ట్రాలకు చెందిన వివరాలను ఆయా వెబ్‌సైట్లలో పొందుపరుస్తారు.
      అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు అందినప్పటికీ శాఖల్లో మంజూరైన పోస్టుల వివరాలు మాత్రం ఆర్థికశాఖకు అందలేదు. ఈ నేపధ్యంలో ప్రతి శాఖలో మంజూరు పోస్టుల వివరాలను ఈ నెలాఖరులోగా పంపాల్సిందిగా ఆర్థికశాఖ ఆదేశించింది. ఆ వివరాలను ఆన్‌లైన్‌లోనే పంపించాలని స్పష్టం చేసింది.
     
     ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ, కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అధికారులతో ఢిల్లీలో గురువారం కమలనాథన్, సీఎస్ మహంతి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ సమావేశం కానున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉద్యోగుల పంపిణీకి అనుసరించిన మార్గదర్శక సూత్రాలు, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలు, అధికరణ 371-డి తదితర అంశాలపై చర్చిస్తారు.

Advertisement
Advertisement