లాక్‌డౌన్‌ తర్వాతే నియామకాల జోరు

9 Jun, 2020 19:44 IST|Sakshi

హైరింగ్‌పై వేచిచూసే ధోరణిలో కార్పొరేట్‌ ఇండియా

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో భారత్‌లో జాబ్‌ మార్కెట్‌ కుదేలైంది. రానున్న మూడు మాసాల్లో కేవలం 5 శాతం కంపెనీలే నూతన నియామకాలపై దృష్టి సారించగా, పలు కార్పొరేట్‌ కంపెనీలు లాక్‌డౌన్‌ పూర్తిగా ముగిసేవరకూ వేచిచూసే ధోరణిని కనబరుస్తున్నాయని తాజా సర్వే వెల్లడించింది. జులై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో నికర ఉపాథి రేటు సర్వే చేపట్టిన 15 ఏళ్ల కనిష్ట స్ధాయిలో 5 శాతంగా ఉందని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే వెల్లడించింది.

సానుకూల హైరింగ్‌ ట్రెండ్‌ను కనబరిచిన 44 దేశాల్లో భారత్‌ టాప్‌ 4 స్ధానంలో ఉండటం మాత్రం ఊరట కలిగిస్తోంది. జపాన్‌, చైనా, తైవాన్‌లు వరుసగా 11 శాతం, మూడు శాతం, మూడు శాతం సానుకూల హైరింగ్‌ ధోరణులతో తొలి మూడుస్ధానాల్లో నిలిచాయి. ఆర్థిక మందగమనం, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కార్పొరేట్‌ ఇండియా ఉద్యోగుల నియామకాల్లో హేతుబద్ధంగా వ్యవహరిస్తోందని, లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగిన అనంతరం డిమాండ్‌ పెరిగే క్రమంలో నియామకాలు ఊపందుకునేలా వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తోందని మ్యాన్‌పవర్‌గ్రూప్‌ ఇండియా ఎండీ సందీప్‌ గులాటీ చెప్పుకొచ్చారు.

భారత్‌లో ఆశావహ దృక్పథం నెలకొందని, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌ పలు రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉద్యోగార్థుల ఆశలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మైనింగ్‌, నిర్మాణ, బీమా, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో జాబ్‌ మార్కెట్‌ ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. మధ్యతరహా సంస్ధల్లో హైరింగ్‌ అధికంగా ఉంటుందని ఆ తర్వాత భారీ, చిన్నతరహా సంస్ధలు నియామకాలకు మొగ్గుచూపుతాయని అంచనా వేశారు. లాక్‌డౌన్‌ సమయంలో సాంకేతికత నూతన ఒరవడికి దారితీసిందని అన్నారు.

చదవండి : 10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో

మరిన్ని వార్తలు