జ్యూవెలర్లకు ఐటీ షాక్‌..

27 Feb, 2020 15:48 IST|Sakshi

ముంబై : నరేంద్ర మోదీ సర్కార్‌ 2016లో నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున విక్రయించిన జ్యూవెలర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2016 నవంబర్‌ 8న ప్రధాని నోట్ల రద్దును వెల్లడించగానే పెద్దసంఖ్యలో కస్టమర్లు తమ షోరూంలో నెక్లెస్‌లు, రింగ్‌లు సహా కనిపించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి పాతనోట్లను విడిపించుకున్నారని ముంబైలోని ఓ జ్యూవెలర్‌ వెల్లడించారు. అప్పటి ఆ అమ్మకాలపై ఆదాయ పన్ను అధికారులు ఇప్పుడు తమకు డిమాండ్‌ నోటీసులు పంపుతున్నారని ఆయన వాపోయారు. రెండు వారాల్లో జరిగే అమ్మకాలు తాము ఆ ఒక్క రాత్రే జరిపామని తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ వ్యాపారి తన చివరి పేరును జైన్‌గా పేర్కొన్నారు. కాగా ఆ రాత్రి ఎంతమేరకు టర్నోవర్‌ జరిగిందో వివరాలు వెల్లడించాలని తనకు మూడు నెలల కిందట ట్యాక్స్‌ నోటీసులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఉత్తర్వులపై ఆయన అప్పీల్‌కు వెళ్లారు. అయితే మన చట్టాల ప్రకారం వివాదాస్పద మొత్తం 20 శాతం సదరు వ్యాపారి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాము కేసును ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించేందుకు తాము తమ వ్యాపారాలను మూసివేయాల్సి వస్తుందని జైన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి : ఆలయం వద్ద బయటపడిన బంగారు నాణేలు

జైన్‌ మాదిరిగా దేశవ్యాప్తంగా 15,000 మంది జ్యూవెలర్లకు ట్యాక్స్‌ డిమాండ్లను జారీ చేశారని ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సురేంద్ర మెహతా వెల్లడించారు. జెమ్స్‌, జ్యూవెలరీ రంగానికి చెందిన వారి నుంచి పన్ను అధికారులు రూ 50,000 కోట్లు వసూలు చేయాలని అంచనా వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పీల్‌కు వెళ్లదల్చుకునే వారు 20 శాతం డిపాజిట్‌ చేయడం, కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సి రావడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జ్యూవెలర్లు రుణాలు చెల్లించడంలో డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పాత రాబడిపై పన్ను డిమాండ్‌ చేసే అధికారం పన్ను అధికారులకు ఉన్నప్పటికీ మొత్తం రాబడిని పన్నుగా డిమాండ్‌ చేయడం మాత్రం అసాధారణమని బులియన్‌ వర్గాలతో పాటు పన్ను నిపుణులూ పేర్కొంటున్నారు. మూడేళ్ల కిందట మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తవ్వితీసి ఆ వ్యక్తి ఎలా మరణించాడు..చంపిన వ్యక్తిని పట్టుకోవడం ఎలా అని పోలీసులు ఆరా తీసినట్టుగా ఈ వ్యవహారం ఉందని కోల్‌కతాకు చెందిన ఓ పన్ను అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఏడాది పెద్దసంఖ్యలో జ్యూవెలర్లకు టాక్స్‌ డిమాండ్‌ నోటీసులు పంపారని, వీటి ద్వారా రూ 1.5 నుంచి రూ 2 లక్షల వరకూ వసూళ్లు రాబట్టాలని ఆశిస్తున్నట్టు ఇద్దరు సీనియర్‌ ట్యాక్స్‌ అధికారులు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఇబ్బందులకు గురవుతుండటంతో పన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు ఈ కసరత్తు చేపట్టారని జ్యూవెలర్లు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు