రిటర్నులు ఎందుకు వేయాలి?

4 Jul, 2016 00:57 IST|Sakshi
రిటర్నులు ఎందుకు వేయాలి?

చాలా మంది రిటర్నులు ఎందుకు వేయాలని అడుగుతారు. పాన్ ఉంటే వేయాలా.. ఆదాయం లేకపోయినా వేయాలా.. బంగారం కొనుగోలు చేస్తే వేయాలా.. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక సమాధానం. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.... మీ వయసును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది.  బేసిక్ లిమిట్‌కు మించి మీ నికర ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకోండి.  రిటర్నులు దాఖలుతో ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
 
చట్టాన్ని గౌరవించండి!
చట్టాన్ని అనుసరించడం మన బాధ్యత. కంపెనీలలో డెరైక్టర్లు రిటర్నులు దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలలో భాగస్వాములు కూడా రిటర్నులు వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంట్ ఉన్నా రిటర్నులు దాఖలు తప్పనిసరి. అలాగే విదేశాల్లో ఆస్తులు ఉన్నా, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినా రిటర్నులు వేయండి. ట్యాక్సబుల్ ఇన్‌కమ్ లేకపోయినా విదేశాలలో ఉన్న అంశాలను రిటర్నులలో పొందుపరచాలి.
 
రిఫండ్ పొందాలంటే..
ప్రతిచెల్లింపులు చేసేవారు టీడీఎస్ చేస్తున్నారు. అంటే మూలంలోనే కోత. కొంత మందికి ట్యాక్సబుల్ ఇన్‌కమ్ దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువగా ఉండటం వలన కోతలను అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాలో జమయ్యినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కాని రిఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు రిఫండ్ ఉంది అంటే ఆన్‌లైన్లో దాఖలు చేయాలి సుమా.
 
డిడక్షన్ల క్లెయిమ్ ఎలా?
అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80 సీ, 80 డీ, 80 డీడీ, 80 ఈ.. ఇలా ఎన్నో. వీటి అన్నింటికీ కాగితాలు ఉండాలి. రిటర్నులతోపాటు జతపరచకపోయినప్పటికీ భద్రపరచుకోవాలి. స్థూల ఆదాయం లో నుంచి వీటిని మినహాయిస్తారు. క్లెయిమ్ మార దు. కానీ స్థూల ఆదాయం మారొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే.. మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లు. ఉదాహరణకు మీ స్థూల ఆదాయం 3 లక్షలు. 80 సీ కింద రూ. 1,50,000 చెల్లించారు.

ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.1,50,000. పన్ను భారం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం రూ.1,00,000 పెరిగిందనుకోండి. అప్పుడు గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది.
 
షేర్లు అమ్ముతున్నారా..
షేర్ల లావాదేవీలలో నష్టం రావచ్చు. లాభాలు పొందొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే.. అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్‌కమ్ సరే.. లావాదేవీల్లో నష్టం రావొచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద ఆదాయం పడిపోవచ్చు. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో సర్దుబాటు చేయవచ్చు. అందుకే కచ్చితంగా ఈ లావాదేవీలను చూపిస్తూ రిటర్నులు దాఖలు చేయండి.

అమెరికా నుంచి అబ్బాయి డబ్బు పంపిస్తే!
విదేశాల నుంచి అబ్బాయి/అమ్మాయి/ఇతరులు మీకు డబ్బు పంపుతున్నారా? భయపడనక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం మీ అకౌంట్‌లో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే గ్రాట్యుటీ, జీవిత బీమా వంటి పన్నుకు గురికాని ఆదాయాలనూ డిక్లేర్ చేస్తూ రిటర్నులు దాఖలు చేయాలి.
 
మరిన్ని ప్రయోజనాలు..
వీసా అధికారులు, బ్యాంక్ ఆఫీసర్లు, మీకు రుణమిచ్చే వారు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, సంస్థలు... ఇలా ఎందరో ఆదిలోనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు అడుగుతున్నారు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా.. వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి.
- ట్యాక్సేషన్ నిపుణులు
కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య

మరిన్ని వార్తలు