భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్‌

16 Dec, 2017 18:32 IST|Sakshi

న్యూఢిల్లీ : భారతీ ఎయిర్‌టెల్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) గట్టి షాకిచ్చింది. సిమ్‌ కార్డులు, బ్యాంకు క్లయింట్లకు ఆధార్‌తో లింక్‌ అయ్యే ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది.  సిమ్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ఆధారితంగా ఆధార్‌-కేవైసీని ఉపయోగించి సబ్‌స్క్రైబర్లకు తెలియకుండా భారతీ ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంకు అకౌంట్లను ప్రారంభిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో యూఐడీఏఐ ఈ చర్యలు తీసుకుంది. ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఆరోపణల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌కు వ్యతిరేకంగా యూఐడీఏఐ గత నెలలోనే విచారణకు ఆదేశించింది. 

మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింకింగ్ కోసం వచ్చిన ఎయిర్‌టెల్ ఖాతాదారుల రిక్వెస్ట్‌లను వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో పేమెంట్‌ అకౌంట్లని సృష్టించింది. అలా సృష్టించడమే కాకుండా సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసినప్పుడు వినియోగదారునికి అందాల్సిన సబ్సిడీని ఎయిర్‌ టెల్‌ పేమెంట్‌ ఖాతాలో చేరేలా చేసింది. వాస్తవానికి ఎయిర్‌టెల్ ఖాతాదారులు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినా.. ఆ ఖాతాలకు కాకుండా సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో పడేలా అక్రమాలకు పాల్పడింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియపై.. గ్యాస్ సబ్సిడీ ఎయిర్‌టెల్ అకౌంట్లకు మళ్లడంపై ఎయిర్‌‌టెల్‌ యూజర్లు యూఐడీఏఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదుపై స్పందించిన ఆ సంస్థ ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుపై ఎయిర్‌‌టెల్‌‌పై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఆధార్‌ ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుపై యూఐడీఏఐ చర్యలు తీసుకుంది. 

మరిన్ని వార్తలు