భాగ్యనగర్‌లో కటేరా ప్లాంటు

8 Aug, 2019 13:07 IST|Sakshi

రూ.700 కోట్లతో నిర్మాణం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజైన్, టెక్నాలజీని ఆసరాగా చేసుకుని నిర్మాణ రంగంలో ఉన్న యూఎస్‌ కంపెనీ కటేరా హైదరాబాద్‌ వద్ద ప్లాంటును నెలకొల్పుతోంది. శంషాబాద్‌ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ సుమారు రూ.700 కోట్లు వెచ్చిస్తోంది. నవంబరు నుంచి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తుల తయారీ ప్రారంభం అవుతుందని కటేరా ఆసియా ప్రెసిడెంట్‌ ఆశ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. డిజైన్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ నజీబ్‌ ఖాన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2020 మార్చిలో ప్లాంటు నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. 1,000 మందికి ప్రత్యక్షంగా, 7,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. రోబోటిక్‌ అసెంబ్లీ విధానంలో ఏటా 80 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణ ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది.\

వ్యయం 30 శాతం తక్కువ..
కంపెనీ మల్టీ ఫ్యామిలీ హోమ్స్, కమర్షియల్‌ బిల్డింగ్స్, హోటళ్లు, మాల్స్, ఆసుపత్రులు, స్కూళ్ల నిర్మాణం చేపడుతోంది. 700 ప్రాజెక్టులు పూర్తి చేసింది. ‘గోడలు, సీలింగ్, ఫ్లోరింగ్‌ వంటివన్నీ కూడా మా ఫ్యాక్టరీలో తయారవుతాయి. వీటిని నిర్మాణ స్థలంలో సులువుగా బిగించడమే. తలుపులు, కిటికీలు కూడా తయారు చేస్తున్నాం. కట్టడాలు 100 ఏళ్లపాటు మన్నికగా ఉంటాయి. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి కావడమేగాక, వ్యయం 30 శాతం తక్కువ అవుతుంది. ఒక కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. బెంగళూరు సమీపంలో 45 ఎకరాల్లో ప్లాంటు ఉంది. భారత్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,000లపైమాటే’ అని ఆశ్‌ భరద్వాజ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు