హైదరాబాద్లో వి-గార్డ్ స్విచ్గేర్స్ ప్లాంటు

29 Jun, 2016 01:01 IST|Sakshi
హైదరాబాద్లో వి-గార్డ్ స్విచ్గేర్స్ ప్లాంటు

రెండు కంపెనీలను కొంటున్నాం
ఆన్‌లైన్ విక్రయాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షితో వి-గార్డ్ ఎండీ మిథున్ చిట్టిలప్పిలి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీలో ఉన్న వి-గార్డ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌లో స్విచ్‌గేర్ల తయారీ ప్లాంటును నెలకొల్పాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విభాగం నుంచి  కంపెనీకి రూ.40 కోట్ల ఆదాయం సమకూరుతోంది. రూ.150 కోట్లకు చేరుకోగానే తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని వి-గార్డ్ ఎండీ మిథున్ చిట్టిలప్పిలి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. రెండేళ్లలోనే లక్ష్యానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అందుబాటు ధరలో నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తామన్నారు. దక్షిణాది మార్కెట్లో పోటీ ధరలో స్విచ్‌గేర్లను అందించేందుకు హైదరాబాద్ ప్లాంటు దోహదం చేస్తుందని వివరించారు. స్విచ్‌గేర్లతోపాటు కిచెన్ అప్లయాన్సెస్ రంగంలో ఉన్న కంపెనీని కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఒక ఏజెన్సీని నియమించామని, ఏడాదిలో ఈ డీల్స్ పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఫ్యాన్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.

 రెండేళ్లలో నాలుగింతలు..
ప్రస్తుతం కిచెన్ అప్లయాన్సెస్ ద్వారా కంపెనీకి రూ.50 కోట్ల ఆదాయం వస్తోంది. రెండేళ్లలో దీనిని నాలుగు రెట్లకు చేర్చాలన్నది సంస్థ లక్ష్యం. ఇందుకోసం ఏటా నూతన విభాగాలను పరిచయం చేస్తామని మిథున్ చెప్పారు. గ్యాస్ కుక్ టాప్స్ కొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తామన్నారు. సోలార్ ఇన్వర్టర్లు, రూఫ్ టాప్ విభాగంపై మరింత ఫోకస్ చేస్తామన్నారు. వైర్లు, పీవీసీ ఇన్సులేటెడ్ పవర్ కేబుల్స్ తయారీకై కోయంబత్తూరులో రూ.35 కోట్లతో ప్లాంటు స్థాపిస్తున్నట్టు వెల్లడించారు.

 ఆన్‌లైన్‌కు ప్రత్యేకంగా..
వి-గార్డ్ ఇండస్ట్రీస్‌లో 1,800 మంది పనిచేస్తున్నారు. 3,000 పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఏటా ఉద్యోగుల సంఖ్యను 10 శాతం పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆదాయంలో దక్షిణాదియేతర రాష్ట్రాల వాటా 33 శాతముంది. అన్ని మార్కెట్లలో లోతుగా విస్తరించడం ద్వారా దీనిని 50 శాతానికి చేర్చాలన్నది కంపెనీ భావన. ఇక ఆన్‌లైన్ కోసం ప్రత్యేకంగా సొంత వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ఎండీ వెల్లడించారు. ఈ-కామర్స్ కంపెనీల ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తామన్నారు. రెండు మూడేళ్లలో ఆన్‌లైన్ వాటా ప్రస్తుతమున్న రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్లకు చేరుస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వి-గార్డ్ ఇండస్ట్రీస్ రూ.1,850 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2016-17లో రూ.2,100 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది.

మరిన్ని వార్తలు