మాకెల్‌ ఎఫెక్ట్‌: మాల్యా ఆఫర్‌

5 Dec, 2018 11:46 IST|Sakshi

ఆర్థిక నేరస్తుడు, లిక్కర్‌బ్యారన్‌ విజయ్‌ మాల్యా (62) మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. రూ. 9వేలకోట్లకు పైగా రుణాలను ​ ప్రభుత్వ బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్‌కు చెక్కేసిన మాల్యా  ట్వీట్లు ఇపుడు సంచలనంగా మారాయి. ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుక్ను రుణాలు మొత్తం (100 శాతం) ఆయా బ్యాంకులకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బుధవారం ట్వీట్‌ చేశాడు. మొత్తం రుణాలను తిరిగి చెల్లించాలనే తన ప్రతిపాదనను అంగీకరించాలంటూ వరుస ట్వీట్లలో బ్యాంకులను అభ్యర్థించాడు. అదీ అగస్టా వెండ్‌ల్యాండ్‌ కేసులో మాకెల్‌ను స్వదేశానికి రప్పించిన  కేవలం కొన్ని గంటల్లోనే మాల్యా  స్పందించడం విశేషం.  

అధిక ఇంధన ధరలతో  విమానయాన సంస్థలు పాక్షికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ధరాభారంతో నష్టాలెదుర్కొంటున్న తన సంస్థ కింగ్‌ఫిషర్‌ కోసం బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలను తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. బారెల్‌  చమురు140 బిలియన్ డాలర్ల గరిష్ఠ ధరకు చేరడంతో బంగారంలాంటి  తన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మరింత నష్టాల్లోకి కూరుకుపోయిందనీ, అయితే ప్రధాన మూలధనాన్ని 100శాతం తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసిన అంగీకరించాలంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాదు  రాజకీయ నాయకులు, మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ  మరోసారి పాత పల్లవినే ఎత్తుకున్నాడు.

కాగా సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ జేమ్స్‌ మైకేల్‌(57)ను దుబాయ్ నుంచి ఇండియాకు రప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించే కేసులో మరో 5రోజుల్లో(డిసెంబరు 10) లండన్‌ కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే రుణాలు మొత్తం చెల్లిస్తానని  మాల్యా  ప్రకటించడం ఇదే మొదటిసారికాదు...అలాగే  బ్యాంకులు ఈ ప్రతిపాదనను నిరాకరించాయి కూడా. వేలకోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి  తేవడానికి కేంద్రం చర్యల్ని వేగవంతం చేయడంతో మాల్యా గుండెల్లో గుబులు మొదలైనట్టుందని  బిజినెస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరిన్ని వార్తలు