వీసా మినహాయింపులపై ఖతర్‌ క్లారిటీ

11 Aug, 2017 14:04 IST|Sakshi
వీసా మినహాయింపులపై ఖతర్‌ క్లారిటీ
న్యూఢిల్లీ :  సౌదీ నేతృత్వంలో అరబ్‌ దేశాల నిషేధంతో సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్‌.. విదేశీ సందర్శకులకు గుడ్‌న్యూస్‌ అందించిన సంగతి తెలిసిందే. తమ దేశంలో ప్రయాణించడానికి 80 దేశాల ప్రజలు వీసా దరఖాస్తు చేసుకోవాల్సినవసరం లేదని పేర్కొంది. అయితే ఏ దేశం ప్రజలకు ఎన్ని రోజుల వరకు వీసా మినహాయింపు ఉంటుందో క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. బుధవారం ప్రకటించిన ఈ పాలసీలో 80 దేశాలను రెండు పార్ట్‌లుగా విభజించింది. ఈ కొత్త వీసా-ఫ్రీ స్కీమ్‌ కింద వీసా అవసరం లేకుండా ఉండే గడువులను 60 రోజులు, 90 రోజులుగా వర్గీకరించింది.
 
''భారత్‌తో పాటు 46 దేశాల ప్రజలు, వీసా ఏర్పాట్లు చేసుకోకుండా ఖతార్‌లో ఉండేందుకు వీసా మినహాయింపును ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. ఈ మినహాయింపు జారీ తేదీ నుంచి 30 రోజులు వాలిడ్‌లో ఉంటుంది. సింగిల్‌ లేదా మల్టిపుల్‌ ట్రిపుల్లో 30 రోజులు ఖతర్‌లో ఉండొచ్చు.. ఈ మినహాయింపును మరో 30 రోజులు కూడా పొడిగిస్తాం'' అని ఖతర్‌ ఎయిర్‌వేస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, రష్యా, చైనా దేశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. మరో 33 దేశాలకు వీసా మినహాయింపును జారీ తేదీ నుంచి 180 రోజులు చెల్లుతుందని, సింగిల్‌ లేదా మల్టిఫుల్‌ ట్రిపులలో వీరు 90 రోజుల వరకు ఖతర్‌లో ఉండొచ్చని పేర్కొంది. ఈ దేశాల్లో ముఖ్యంగా ఫ్రాన్స్‌ లాంటి యూరోపియన్‌ దేశాలు, టర్కీ ఉన్నట్టు తెలిపింది.
 
ఖతర్‌లో ప్రవేశించే సమయంలో ఎలాంటి రుసుము తీసుకోకుండానే మల్టీ ఎంట్రీ వేవర్‌ ఇవ్వనున్నట్టు ఖతర్‌ అధికారులు పేర్కొన్నారు. దీనికి గానూ ఆరునెలలకు తక్కువగా లేకుండా వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టుతో పాటూ ప్రయాణానికి సంబంధించి టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. 80 దేశాలకు చెందిన పౌరులు ఫ్రీ వీసా సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఖతార్ టూరిజం అథారిటీ చైర్మన్‌ హసన్‌ అల్‌ ఇబ్రహిం తెలిపారు.
మరిన్ని వార్తలు